విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి మూడు రోజుల పాటు లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్, కౌన్సిల్ డిప్యుటీ చైర్మన్ క్రీడా పోటీలను ప్రారంభిస్తారు. మంగళవారం నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వరకు పోటీలు నిర్వహిస్తారు. గురువారం ముగింపు ఉత్సవం ఉంటుంది. శాప్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఈరోజు ఉదయం క్రీడా పోటీలకు సన్నాహక ఏర్పాట్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 13 రకాల ఆటల పోటీల్లో పాల్గొననున్నారు. అథ్లెటిక్స్, క్రికెట్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, వాలీబాల్, త్రోబాల్, కబడ్డీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతాయి. షటిల్ బ్యాడ్మింటన్‌ను డీఆర్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ క్రీడల కోసం రిఫరీలు, అంపైర్లు, సహాయకులు.. మొత్తంగా 200 మంది సిబ్బందిని నియమించారు. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలుగా ఉండగా.. క్రీడా పోటీల్లో పాల్గొనడానికి 140 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలానే శాసనమండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా..13 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు ముగిశాక స్టేడియంలో పోటీలు ప్రారంభమవుతాయి. చివరి రోజు సీఎం చంద్రబాబు ఆడే అవకాశం ఉంది.
శాప్ చైర్మన్ రవి నాయుడుతో కలిసి క్రీడా పోటీల ఏర్పాట్లను మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ… ’70 శాతం మంది శాసన సభ్యులు రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. గత ఐదేళ్లలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఏం చేసారో చూశాం. సీఐడీ ఎంక్వైరీ నివేదిక వచ్చాక ఆడుదాం ఆంధ్రపై మాట్లాడుతా. మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలయ్యే పోటీలను ప్రారంభించడానికి స్పీకర్, మండలి డిప్యుటీ చైర్మన్ వస్తారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక స్ధానం కల్పించింది. 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు అవకాశం ఇవ్వడమే కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇవాళ సీఎం ఢిల్లీకి వెళుతుండటంతో.. రేపు లేదా ఎల్లుండు పోటీలలో పాల్గొనే అవకాశం ఉంది. సీఎం చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరగనుంది’ అని చెప్పారు.