ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని, ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను మంత్రి లోకేష్ కోరారు. లక్ష్మీ మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్నాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.
పెట్రో కెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతం అని మంత్రి లోకేష్ లక్ష్మీ మిట్టల్‌కు తెలిపారు. ప్రణాళికాబద్ధమైన 83.3 ఎంటీపీఏ సామర్థ్యం గల పోర్టు, వైజాగ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ కొలువై ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వం మద్దతు పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని మంత్రి వివరించారు. భావనపాడు-మూలపేట ప్రాంతం తయారీ, ఆర్ అండ్ డీ, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి.. పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని వివరించారు.
హెచ్‌పీసీఎల్-మిత్తల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ HMEL-HPCL మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో భారత దేశంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ను మంత్రి లోకేష్ కొరారు. ఈ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఏపీఈడీబీ అధికారులతో కలసి సైట్‌ను సందర్శింఛాలన్నారు. 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.