NTV Telugu Site icon

Minister Amarnath: రెండు రైళ్లలో ఏపీకి చెందిన 342 మందిని గుర్తించాం..

Amarnath

Amarnath

Minister Amarnath: ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులతో కలిసి ఒడిశాలో రైలు ప్రమాద ఘటనాస్థలికి వెళ్లినట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. సీఎం ఆదేశాలతో బాధితులకు సాయం అందేలా చూస్తున్నామన్నారు. రెండు రైళ్లలో మొత్తం 342 మంది ఏపీకి చెందిన వారిని గుర్తించామని.. 9 మందికి విశాఖలో చికిత్స జరుగుతోందన్నారు. రిజర్వ్ కంపార్ట్‌మెంట్‌లో 5 గురు ప్రయాణం చేసినట్లు గుర్తించామని మంత్రి చెప్పారు. 276 మంది చనిపోయినట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించిందని అమర్‌నాథ్ తెలిపారు. 187 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. ముగ్గురు ఐఏఎస్‌లు ఇంకా భువనేశ్వర్‌లోనే ఉన్నారని ఈ సందర్భంగా చెప్పారు.

Read Also: Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన మరో ట్రైన్..

రిజర్వ్ చేసుకోకుండా ప్రయాణం చేసిన వారు, ఆచూకీ లేరని కుటుంబ సభ్యులు ఎవరైనా సహాయం కోసం ఫోన్ చేస్తే వారికి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంబటి రాములు అనే వ్యక్తి కనిపించటం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారని ఆయన చెప్పారు. ఇతను ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి.. ఏపీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారని చెప్పారు. ఏపీకి చెందిన ఒక వ్యక్తి గురుమూర్తి మాత్రమే చనిపోయారని.. వారి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి వెల్లడించారు. 72 గంటల పాటు మార్చురీల్లో మృతదేహాలను ఉంచనున్నట్లు ఒడిశా అధికారులు చెప్పారని మంత్రి తెలిపారు. ఆ తర్వాత సామూహిక ఖననాలు చేస్తారని మంత్రి చెప్పుకొచ్చారు. ఏపీకి చెందిన గ్రౌండ్ సిబ్బంది, అధికారులు క్రిమేషన్ వరకు ఉండే అవకాశం ఉందన్నారు.

Show comments