CM Chandrababu Warns Rebel Candidates: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య పొత్తులు, రెబల్ అభ్యర్థుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలని, ఇందులో మరో ఆలోచనకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. కూటమి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగానే భావించాలని సీఎం హెచ్చరించారు.
క్యాబినెట్ ఎజెండాపై చర్చ అనంతరం ఎన్నికల పొత్తులు, సీట్ల సర్దుబాటు, రెబల్ అభ్యర్థుల అంశంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. అభ్యర్థుల వ్యక్తిగత ప్రాధాన్యాన్ని పక్కనపెట్టి ఎన్డీఏ కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని సూచించారు. తాను, పవన్ కల్యాణ్, బీజేపీ నేత మాధవ్ కలిసి కూర్చుని సీట్ల సర్దుబాటు చేశామని తెలిపారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ముగ్గురం కలిసి ప్రజలకు, పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులుగా ఎవరైనా బరిలో ఉంటే వెంటనే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారు. రెబల్ అభ్యర్థులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా ముందుగానే పరిష్కరించుకోవాలని, పొత్తు ధర్మాన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇదే అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తాము ముగ్గురం కలిసి కూర్చుని సీట్ల సర్దుబాటు చేయడం ద్వారా ప్రజలకు, పార్టీ కేడర్‌కు మంచి సందేశం ఇచ్చామని తెలిపారు. ప్రజల నుంచి, పార్టీ శ్రేణుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని పేర్కొన్నారు. జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఉన్న చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు తమ సొంత నియోజకవర్గాలతో పాటు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న జిల్లాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలు, సీట్ల సర్దుబాటులో వివాదాలు ఎక్కడైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించకుండా చూడాలని.. అభ్యర్థుల విజయానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం తలెత్తిన వివాదాలను సకాలంలో పరిష్కరించుకోవాలని, ఎన్నికల తర్వాత క్రమశిక్షణ విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై కూడా సీఎం చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. ముందుగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తవుతాయని.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం సహకార సంఘాల (సొసైటీ) ఎన్నికలు కూడా ఉంటాయని తెలిపారు. ఈ ఎన్నికలన్నింటికీ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, అభ్యర్థుల ఎంపిక, కూటమి సమన్వయం, స్థానిక స్థాయిలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి సారిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

