ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల బెయిల్ కాన్సిల్ చేయాలని ఏపీ హైకోర్టులో ప్రభుత్వం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు హైకోర్టు అనుమతి కోసం ప్రాసిక్యూషన్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు లిక్కర్ స్కాం నిందితులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్దమవుతున్నారు. ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చినా.. 3 గంటల పాటు జైలు అధికారులు అమలు చేయలేదని పిటిషన్ వేయటానికి రెడీగా ఉన్నారు. నిందితులు రేపు పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Also Read: AP Liquor Scam: విజయవాడ సబ్ జైలు వద్ద హైడ్రామా.. ఆందోళన చేస్తున్న లిక్కర్ కేసు నిందితులు!
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ధనుంజయ రెడ్డి (ఏ-31), కృష్ణమోహన్ రెడ్డి (ఏ-32), గోవిందప్ప బాలాజీ (ఏ-33)లకు బెయిల్ ఇస్తూ న్యాయాధికారి భాస్కరరావు శనివారం సాయంత్రం తీర్పును వెలువరించారు. ముగ్గురు నిందితుల బెయిల్ ఆర్డర్లను తీసుకుని.. వారి తరఫు న్యాయవాదులు విజయవాడ సబ్ జైలు వద్దకు వెళ్లారు. అప్పటికే సమయం కావడంతో వారిని జైలు అధికారులు విడుదల చేయలేదు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు మే 16న అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. గోవిందప్ప మే 13న సిట్ అరెస్టు అయి.. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లో ఉన్నారు.
