Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!

  • కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో..
  • జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పనులకు శ్రీకారం..
Pawan Kalyan

Pawan Kalyan

Jal Jeevan Mission 2.0: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పథకం పనులకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామీణ కుటుంబానికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.30,156 కోట్ల వ్యయంతో జల్ జీవన్ మిషన్ పనులను చేపడుతున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కుళాయి కనెక్షన్లు అందనున్నాయి.

పవన్ కళ్యాణ్ విమర్శలు

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరుకు ప్రత్యేకమైన చరిత్ర, గుర్తింపు ఉందన్నారు. వస్త్ర, బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు మినీ ముంబైగా పేరు పొందిందని, దసరా ఉత్సవాల సందర్భంగా మినీ మైసూర్‌గా కూడా ఖ్యాతి సాధించిందని పేర్కొన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి ఓటు వేసినందుకు, తమకు వెన్నంటే నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగానే రూ.30 వేల కోట్లకు పైగా వ్యయంతో తాగునీటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.

గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో తాగునీటి పథకాల కోసం కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం మాత్రం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక దృష్టి సారించి రూ.30 వేల కోట్లకు పైగా నిధులతో భారీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

ప్రజల సమస్యలను పట్టించుకోలేదు

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని తాళ్లమాపురం ప్రాంతంలో సుమారు 6 వేల మంది జనాభా ఉన్నప్పటికీ, అక్కడి ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పక్కన పెట్టారని విమర్శించారు. కుటుంబ ప్రభుత్వానికి రాజకీయం కాదని, ప్రజల అభివృద్ధే ముఖ్యమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి

జల్ జీవన్ మిషన్ పనుల్లో భాగంగా పైపులైన్ల కోసం రోడ్లపై తవ్వకాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పైపులైన్ పనుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు పూర్తయిన తర్వాత రోడ్లను సక్రమంగా పునరుద్ధరించాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిని కూడా ఇబ్బందులకు గురిచేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాగునీరు వంటి ప్రాథమిక అవసరాల కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఇకపై ఉండకూడదని ఆయన అన్నారు.