ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి డా. తానేటి వనిత న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఫ్లాట్ ఫారమ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల హోంశాఖ మంత్రులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. తీరప్రాంత ప్రమాదాల నుండి ఎదురయ్యే సమస్యలు మరియు సవాళ్లకు సంబంధించిన అంశం పైన హోంమంత్రి డా.తానేటి వనిత గారు ఈ సమావేశంలో మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత గారు మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల కారణంగా ప్రతి ఏటా విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందనే విషయాన్ని గుర్తుచేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విపత్తు నిర్వహణ శాఖలో మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తులను ఎదుర్కోవడంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పూర్తిగా విజయం సాధించిందని స్పష్టంచేశారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి కరువు అనే ప్రసక్తే లేకుండా చేసిన ఘనత సీఎం జగన్ గారికే దక్కుతుందని హోంమంత్రి వనిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 నవంబర్ చివరి వారంలో ఏర్పడిన తుఫానులు తూర్పు మరియు పశ్చిమ తీరాలపై పెను ప్రభావాన్ని చూపించాయని హోంమంత్రి తానేటి వనిత గారు గుర్తుచేశారు. ఈ తుఫానుల కారణంగా గ్రామాల్లోని ప్రజల ఇళ్లకు, పంట పొలాలకు, వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
Read Also: Govinda Namalu Bhakthi Tv Live: గోవింద నామాలు పఠిస్తే సర్వ శుభాలు
కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయంతో రాష్ట్రం లోని 9 తీర ప్రాంత జిల్లాలలో దాదాపు 219 సైక్లోన్ షెల్టర్లను నిర్మించామని తెలిపారు. అయినప్పటికీ తుఫాన్ లు ఏర్పడిన ప్రతిసారి లక్షలాది మందిని తరలించాల్సిన అవసరం లేకుండా సైక్లోన్ షెల్టర్ల తో పాటు తీరప్రాంతాల్లోని గృహాలను కూడా మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని హోం మంత్రి తానేటి వనిత గారు స్పష్టం చేశారు. గ్రామ స్వరాజ్యం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్ గారు తీసుకువచ్చిన విషయాన్ని హోంమంత్రి వనిత గుర్తు చేశారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తుఫానుల సమయంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం లోనూ, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ వాలంటీర్లు ఎంతో ఉపయోగపడ్డారని తెలిపారు.
తుఫాను హెచ్చరికల విషయంలో కచ్చితమైన వివరణ ఇవ్వలిగితే.. ప్రమాదంలో ఉన్న వారిని మాత్రమే ఇళ్ల నుండి ఖాళీ చేయించ గలుగుతామన్నారు. ఇప్పటికే తీర ప్రాంతంలో వంతెనల నిర్మాణం, సెలైన్ కట్టలు, షెల్టర్ల ఆధునీకరణ, రోడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతాలను, బీచ్ లను రక్షించడానికి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ అవసరం ఉందన్నారు. ప్రదానంగా తీర ప్రాంతంలో కోత అనే తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఫలితంగా తీర ప్రాంతాల్లో భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ తీర ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించడానికి అధునాతన సాంకేతికత మరియు ఆర్థిక సహాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఉందని హోమంత్రి వనిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కోస్తా తీర ప్రాంతాల్లో ఉండే సమస్యల గురించి వివరించడానికి తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి హోంమంత్రి తానేటి వనిత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: Diplomatic Ties: ఇరాన్, సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు.. చైనా మధ్యవర్తిత్వంతో ఒప్పందం