NTV Telugu Site icon

AP High Court: చంద్రబాబు కేసులో సీఐడీకి షాక్.. ఆ పిటిషన్‌ తిరస్కరణ

Ap High Court

Ap High Court

AP High Court: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలైన విషం విదితమే.. అనారోగ్య సమస్యలతో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు.. కొన్ని షరతులను కూడా విధించింది.. కానీ, చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. అయితే, సీఐడీకి హైకోర్టు షాకిచ్చింది.. చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.

Read Also: AI Creative Images : AI రూపొందించిన పాస్తా నగర చిత్రాలను చూశారా? వావ్ అద్భుతమే..

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేసిన హైకోర్టు.. రాజకీయ ర్యాలీల్లో కూడా పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కూడా కొనసాగుతాయని పేర్కొంది.. కానీ, చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై మొన్న వాదనలు ముగించిన హైకోర్టు.. ఈరోజు తీర్పు వెలువరించింది. కాగా, స్కిల్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఇదే సమయంలో ఆయనను అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి.. దీనిపై హైకోర్టు వెళ్లి మధ్యంతర బెయిల్‌ తెచ్చుకున్నారు.. ఆ తర్వాత ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్న విషయం విదితమే.