AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం విమాన సర్వీసులపై పడింది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో కొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించగా, మరికొన్ని సర్వీసులు రద్దైనట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వైజాగ్–విజయవాడ విమానం శంషాబాద్‌కు మళ్లింపు
విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విజయవాడలో ల్యాండ్ కాలేకపోయింది. దీంతో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు దారి మళ్లించారు.
హైదరాబాద్–రాజమండ్రి విమానం బెంగళూరుకు మళ్లింపు
మరోవైపు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన స్టార్ ఎయిర్‌లైన్స్ విమానం (591) కూడా వాతావరణ పరిస్థితుల కారణంగా రాజమండ్రిలో దిగలేకపోయింది. దీంతో ఆ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించినట్లు సమాచారం. వాతావరణ ప్రతికూలతల కారణంగా స్టార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలు విమానాలను అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడ – విశాఖ అన్ని విమానాలు రద్దు…
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే అన్ని విమానాలు రద్దు చేశారు.. ఇక, చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖ వెళ్లాట్సిన ఇండిగో ఫ్లైట్ విజయవాడ నుంచి వెనక్కి పంపించారు.. వాతావరణం సానుకూలం అయ్యే వరకూ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు..
భోగాపురంలో ల్యాండ్ అవ్వని విమానం..
భారీ వర్షాల కారణంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్ ఇండియా IX 1373 విమానం ల్యాండ్ కాలేదు.. బుధవారం రాత్రి 8:35కు విజయవాడ నుండి భోగాపురం బయలుదేరిన విమానం.. రాత్రి 9: 40కు ల్యాండ్ కావాల్సి ఉండగా.. భోగాపురంలో వర్షం కారణంగా సిగ్నల్ వ్యవస్థ పని చేయకపోవడంతో విమానం దారి మళ్లించారు.. విమానంలో మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ కూడా ఉండగా.. నాగపూర్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది ఎయిర్ ఇండియా IX 1373 విమానం.. దీంతో, రెండు గంటల ఉత్కంఠ తర్వాత నాగపూర్ లో సేఫ్ గా ల్యాండ్ అవటంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు..
ప్రయాణికులకు కీలక సూచన
భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణానికి ముందు తమ విమానం రాకపోకల తాజా వివరాలను ఎయిర్‌లైన్ సంస్థల అధికారిక మార్గాల్లో చెక్ చేసుకోవాలని, విమానాశ్రయానికి బయలుదేరే ముందు విమానం స్టేటస్‌ను తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించారు.

