AP Hates Jagan: వై ఏపీ నీడ్స్ జగన్ అనే పేరుతో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ నిర్వహించేందుకు సిద్ధమైంది.. అయితే, వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయినింగ్‌కు కౌంటర్ క్యాంపెయిన్ ప్రారంభిస్తోంది తెలుగుదేశం పార్టీ.. ఏపీ హేట్స్ జగన్ పేరుతో జగన్‌కు కౌంటర్ క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించింది.. ఈ క్యాంపెయిన్ ద్వారా జగన్‌ను ఏపీ ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయానికి వచ్చినట్టు.. సోషల్ మీడియాలో కూడా ఏపీ హేట్స్ జగన్ అనే హ్యాష్ ట్యాగుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంస్‌పై ప్రచారం చేపట్టనున్న టీడీపీ ప్రకటించింది.
దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీ నీడ్స్ జగన్ కాదు.. ఏపీ హేట్స్ జగన్’ అని పేర్కొన్నారు. వద్దు బాబోయ్ జగన్ అంటున్నారు ప్రజలు. వైసీపీ ప్రతినిధుల సభలో జగన్ మాట్లాడిన ప్రతిదీ పచ్చి అబద్దం అని విమర్శించారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసిన జగన్.. మూడు రాజధానులు కడతారా..? అని ప్రశ్నించారు. నవరత్నాల్లో ఏ రత్నమైనా నూటికి 10-15 మందికి మాత్రమే దక్కాయన్న ఆయన.. రూ. 10 లక్షల కోట్ల మేర తెచ్చిన అప్పులేమయ్యాయి..? అని నిలదీశారు. రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులను డీబీటీల రూపంలో ఇచ్చానని చెబుతున్నారు.. మిగిలిన రూ. 7 లక్షల కోట్లపై నిధులేమయ్యాయి..? అని ప్రశ్నించారు. రూ. 7 లక్షల కోట్ల నిధులు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపణలు గుప్పించారు. వైద్య, విద్య రంగాలను జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు. అన్ని నాశనం చేసిన జగన్ ఇంకెందుకని అడుగుతున్నారు..? గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు అడ్డుకుంటున్నారని.. బస్సు యాత్ర చేస్తున్నారా..? అని సెటైర్లు వేశారు. దళితుడ్ని చంపిన అనంతబాబును పక్కన కూర్చొబెట్టుకున్న జగన్.. దళిత పక్షపాతా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బోండా ఉమామహేశ్వరరావు.
మరోవైపు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీనిపై ప్రెస్‌నోట్ విడుదల చేశారు.. ఏపీ నీడ్స్ జగన్ కాదు ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు పిలుపునిస్తున్నారు. బీసీల నోరునొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యమా? మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై వరుస కేసులు బనాయించిన బీసీల ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలపై అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తూ జగన్ పెత్తందారి తనం మరొక సారి రుజువు చేసుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపినందుకు అక్రమ కేసు పెట్టడం హేయం. అన్ని కేసుల్లోనూ కాలవనే మొదటి ముద్దాయిగా చేర్చారు పోలీసులు. శాంతియుత నిరసనలపై పోలీసులు కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసి మరీ చిందులేసిన వైసీపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసులెందుకు పెడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న టీడీపీ దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు.