AP Govt: ఏపీలో టెక్నాలజీ విప్లవం.. మూడు నూతన పాలసీలకు ఉత్తర్వులు జారీ..

Cm Chandrababu Ap

Cm Chandrababu Ap

రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏకంగా మూడు నూతన టెక్నాలజీ పాలసీలకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (AVGC-XR), రోబోటిక్స్, సెమీకండక్టర్ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేలా ఈ విధానాలను రూపొందించారు.

ఈ నూతన విధానాలలో భాగంగా రాజధాని అమరావతి వేదికగా 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యధునాతన AVGC పార్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ రంగాలలో సృజనాత్మకత కలిగిన యువతకు స్థానికంగానే మెరుగైన వేదిక లభించనుంది. అలాగే, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది.

మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకంగా మారిన చిప్ తయారీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సెమీకండక్టర్ పాలసీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఇందుకోసం రాష్ట్రంలో ఏకంగా 5 వేల ఎకరాల భూమిని కేటాయించి ప్రత్యేక సెమీకండక్టర్ పార్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ మూడు పాలసీల అమలు ద్వారా రానున్న రోజుల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడమే కాకుండా, సాంకేతిక నైపుణ్యం కలిగిన లక్షలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.