Chandrababu Convoy: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు.. రూ.1.78 కోట్లతో ఆరు వాహనాలు కొనుగోలు..

Cm Chandrababu Convoy

Cm Chandrababu Convoy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతా కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు రాబోతున్నాయి. ముఖ్యమంత్రి సెక్యూరిటీ కాన్వాయ్ అవసరాల కోసం ఆరు కొత్త ‘ఫోర్స్ అర్బానియా’ వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుపై విధించిన నిషేధ ఉత్తర్వులకు ప్రత్యేక మినహాయింపు (సడలింపు) ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖ పంపిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, అత్యవసర భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ఈ కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా ‘ఫోర్స్ అర్బానియా 4400 WB’ మోడల్‌కు చెందిన ఆరు వాహనాలను సమకూర్చుకోనున్నారు.

ఈ ఆరు వాహనాల కొనుగోలు కోసం మొత్తం రూ.1.78 కోట్లు (రూ.1,78,05,000) అదనపు నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ లెక్కన ఒక్కో వాహనం సగటు ధర రూ.29.67 లక్షలుగా నిర్ణయించారు. పూర్తి పారదర్శకత కోసం ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ అయిన జెమ్ (GeM) పోర్టల్ ద్వారా ఈ వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి భద్రతా కాన్వాయ్‌లో వినియోగిస్తున్న పాత టయోటా వాహనాల స్థానంలో ఈ అత్యాధునిక ఫోర్స్ అర్బానియా వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. భద్రతా సిబ్బంది ప్రయాణానికి మరింత అనువుగా, ఆధునిక సదుపాయాలతో ఈ వాహనాలు ఉండటంతో కాన్వాయ్ సామర్థ్యం మరింత మెరుగుపడనుందని అధికారులు భావిస్తున్నారు. హోంశాఖ ఉత్తర్వులు వెలువడటంతో త్వరలోనే జెమ్ పోర్టల్ ద్వారా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి, కొత్త వాహనాలను సీఎం కాన్వాయ్‌లో చేర్చనున్నారు.