NTV Telugu Site icon

Andhra Pradesh: విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు.. ఈటీఎస్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం

Ets

Ets

Andhra Pradesh: ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగులు పడుతున్నాయి.. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యారు.. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.. ఈటీఎస్‌ తరపున ఒప్పందంపై సంతకాలు చేశారు LEJO SAM OOMMEN, Chief Revenue Officer, ETS India, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బీ శ్రీనివాసరావు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్ధల విద్యార్ధులు ప్రపంచస్ధాయిలో ఉద్యోగాలు సంపాదించేలా ఎదగాలని కోరుకుంటున్నాం. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. ఈ పిల్లలందరూ ప్రభుత్వ బడులు నుంచి వచ్చినవాళ్లు. వారి జీవితాల్లో మార్పుతేవడం ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేస్తే దేవుడి దృష్టిలో వారి కుటుంబాలకు గొప్ప సేవచేసినవాళ్లం అవుతాం. మనం ఏ కార్యక్రమం చేసినా.. అట్టడుగు వర్గాలకు చెందిన వీళ్లను దృష్టిలో ఉంచుకుని.. వారి పట్ల మరింత సహృదయంతో పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదొక సవాల్‌తో కూడిన కార్యక్రమం. మీరు చేపడుతున్న కార్యక్రమాన్ని కేవలం జూనియర్‌ లెవెల్‌కే పరిమితం చేయకుండా.. ప్లస్‌ వన్, ప్లస్‌ టూ సీనియర్‌ లెవెల్‌ వరకూ విస్తరించాలి. 11, 12 తరగతులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల కోసం అప్పుడే విదేశాలకు వెళ్తారు. అందుకే జూనియర్‌ లెవెల్‌తో ఆపేయకుండా సీనియర్‌ లెవెల్‌ వరకూ విస్తరించాలని కోరారు.

ఇక, మీరు కచ్చితంగా మా ప్రభుత్వ బడులను చూడాలని కోరారు సీఎం జగన్‌.. అప్పుడే మీకు మేం విద్యారంగంలో చేస్తున్న మార్పులు నేరుగా అర్ధం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మీరు ప్రవేశపెడుత్నున కోర్సులను ఏ రకంగా మిళితం చేయవచ్చు అనేది అర్ధం చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఈ జూలై ఆఖరు నాటికి రాష్ట్రంలో 6వతరగతి ఆ పై తరగతులకు సంబంధించిన దాదాపు 30,230 క్లాస్‌రూమ్‌లను అంటే దాదాపు 50 శాతం తరగతిగదులను డిజిటలైజ్‌ చేయబోతున్నాం. మొత్తంగా దాదాపు 63వేల క్లాస్‌ రూమ్‌లను డిసెంబర్‌ నాటికి డిజిటలైజ్‌ చేయబోతున్నాం. మరోవైపు 8వతరగతిలోకి అడుగుపెడుతున్న ప్రతి విద్యార్ధికి ట్యాబ్‌లు పంపిణీ చేశాం. ఈ యేడాది కూడా 8వతరగతి విద్యార్ధులకు డిసెంబరు 21న ట్యాబ్‌లు పంపిణీ చేయబోతున్నాం అని వివరించారు.. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా విద్యార్ధులకు బైజూస్‌ సంస్ధతో చేసుకున్న ఒప్పందం ద్వారా కరిక్యులమ్‌లో బైజూస్‌ కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. గడిచిన నాలుగేళ్లలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను సరఫరా చేశాం. వచ్చే ఏడాది 10వతరగతికి కూడా బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ను సరఫరా చేస్తాం. పదోతరగతి పిల్లలు 2025లో సీబీఎస్‌ఈ పరీక్షలకు ఇంగ్లీష్‌ మీడియంలో హాజరు కానున్నారు. అందులో భాగంగానే పిల్లలకు సులభంగా అర్ధమవ్వడంతో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒక పేజీ ఇంగ్లీష్‌, మరో పేజీ తెలుగుతో ఉన్న బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. వీటికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లను మార్పు చేస్తున్నాం అని వివరించారు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 45వేల స్కూళ్లలో నాడు నేడు పేరుతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం అని వెల్లడించారు సీఎం జగన్‌. దశలవారీగా చేపడుతున్న ఈకార్యక్రమంలో తొలిదశలో సుమారు 15,750 పైగా అభివృద్ధి చేయగా.. డిసెంబరు నాటికి మరో 16వేలకు పైగా స్కూళ్లలో నాడు నేడు రెండో దశ పూర్తవుతుంది. మొత్తంగా సుమారు 32వేల స్కూళ్లలో నాడు నేడు చేపట్టిన ట్టవుతుంది. వచ్చే ఏడాది నాటికి మిగిలిన 15వేల స్కూళ్లలో కూడా నాడు నేడు చేపడతాం. మా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్ధికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని కూడా ఉచితంగా అందిస్తున్నాం. వీటకి అదనంగా ఇప్పుడు టోఫెల్‌ ప్రైమరీ, టోఫెల్‌ జూనియర్‌ , టోఫెల్‌ సీనియర్‌ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం అని వ్యాఖ్యానించారు సీఎం జగన్‌.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం స్వరూపాన్ని మార్చే కార్యక్రమం ఇది. సీఎం జగన్‌ జగన్‌ దార్శినిక నాయకత్వంలో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు Alain Daumas, Senior Director Channel, Management at ETS.. ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రగతిశీలక ముందడుగు. విద్యలో నాణ్యతను పెంచేందుకు ఈ ఒప్పందం చాలా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఏ ప్రాంతంతోనైనా సులభంగా విద్యార్థులు అనుసంధానం అవుతారు. విద్యాపరంగా, వృత్తిపరంగా వారికి మంచి ప్రపంచంలో మంచి అవకాశాలు లభిస్తాయి. నా వరకు చూస్తే.. మా తల్లిదండ్రులు ఇద్దరూ ఫ్రాన్స్‌కు చెందినవాళ్లు. ఇద్దరికీ ఇంగ్లిషు ఒక్క ముక్కరాదు. నేను ఇంగ్లిషు నేర్చుకున్నాను. నేను అమెరికా వెళ్లగలిగాను. అమెరికా పౌరసత్వం పొందగలిగాను. అంతేకాదు ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు అమెరికాలోని ప్రిన్స్‌టన్‌కు వచ్చి విద్యను అభ్యసిస్తారని భావిస్తున్నాం అని పేర్కొన్నారు.

ఇక, ఒప్పందంలోని వివరాల్లోకి వెళ్తే..
* ఈ ఒప్పందం ద్వారా అమెరికన్‌ మరియు యూరోపియన్‌ యాక్సెంట్స్‌లో పిల్లలకు నైపుణ్యాలను పెంచేందుకు కృషి. అర్థం చేసుకోవడమే కాకుండా విద్యార్థులు చక్కగా మాట్లాడ్డంలో దోహదపడుతుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు విద్యార్థులకు అలవడతాయి. టోఫెల్‌ పరీక్షలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌తో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమం.

* 3, 4వ తరగతి పిల్లలకు విద్యాసంవత్సరం చివర్లో మార్చి నెలలో సర్టిఫైడ్‌ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. 5వ తరగతి పిల్లలకు అక్టోబరులో మరొక సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. మార్చిలో తుది పరీక్ష నిర్వహిస్తారు. 6 నుంచి 8వ తరగతి పిల్లలకు విద్యా సంవత్సరం చివర్లో అంటే మార్చినెలలో సర్టిఫైడ్‌ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. అలాగే 9వ తరగతి విద్యార్థులకు మధ్యంతరం లేదా అక్టోబరులో మరొక సర్టిఫైడ్‌ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. తుది పరీక్ష విద్యాసంవత్సరం చివర్లో అంటే మార్చి నెలలో నిర్వహిస్తారు. 10 వ తరగతి విద్యార్థులకు టోఫెల్‌ జూనియర్‌ స్పీకింగ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.

* పరీక్షలకోసం విద్యార్థులను సన్నద్ధంచేసే కార్యక్రమంలో భాగంగా 3 నుంచి 5 తరగతుల వారికి వారానికి మూడుసార్లు స్మార్ట్‌ టీవీల ద్వారా ఆడియో, వీడియోద్వారా కంటెంట్‌ను వినిపిస్తారు. ఒక్కో గంటపాటు ఈ కంటెంట్‌ను పిల్లలకు నేర్పిస్తారు. 3-4 తరగతుల వాళ్లు సన్నాహక పరీక్షలు రాస్తే, 5వ తరగతి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలో పోటీపడే అవకాశం ఉంటుంది.

* 6 నుంచి 10వ తరగతి పిల్లలకు ఐఎఫ్‌పీల ద్వారా వారానికి మూడుసార్లు వీడియోను ప్లే చేస్తారు. 6 నుంచి 8 వ తరగతి పిల్లలు సన్నాహక పరీక్షలు రాస్తే, 9 వ తరగతి పిల్లలు ప్రపంచస్థాయిలో నిర్వహించే పరీక్షలకు హాజరవుతారు.

* రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు చదువుతున్న స్కూళ్లకు సంబంధించి ఇంగ్లిషు టీచర్లను అమెరికాలో ప్రిన్స్‌టన్‌లో మూడురోజులపాటు శిక్షణ కార్యక్రమాలకు పంపిస్తారు. ఒప్పందంలో భాగంగా టోఫెల్ పరీక్షలను సీనియర్ లెవెల్‌కూ (ప్లస్‌ -1, ప్లస్ -2) విస్తరించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.