Site icon NTV Telugu

Ap Fisheries University: ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీ కార్యక్రమాలు ప్రారంభం

Appala 1

Appala 1

ఏపీలో ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన ఫిషరీస్ యూనివర్శిటీ కార్యకలాపాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి. ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని ప్రకటించారు మంత్రి సీదిరి అప్పలరాజు. యూనివర్శిటీ లోగోను ఆవిష్కరించిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు 2022-23 ఏడాదికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. ఆక్వాలో ఉత్పత్తి వ్యయం తగ్గించటానికి తగిన చర్యలు ఈ ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో నిలబడగలిగే పరిస్థితులను కోసం ప్రయత్నిస్తున్నాం అన్నారు.

ఈ మధ్యనే హైపవర్ కమిటి కూడా ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ఎప్పటికప్పుడు మార్కెట్ రేటు, డిమాండ్లను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర ప్రజల అదృష్టం జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు సరైనవి కావన్నారు మంత్రి అప్పలరాజు. చంద్రబాబు హయాంలో కోవిడ్ వచ్చి ఉంటే రాష్ట్రాన్ని వల్లకాడు చేసి ఉండేవాడు. ఈక్వెడార్ వంటి దేశాల్లో అప్పట్లో ఆక్వానే లేదు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయం పేరుతో ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం స్ధాపనకు అడుగులు పడిన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళ తర్వాత ఇది దేశంలో మూడవ ఆక్వా విశ్వవిద్యాలయం కాబోతుంది.

ఇందుకోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సరిపల్లి మరియు లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించడం జరిగింది. భవన నిర్మాణ పనులకై మొత్తం రూ. 332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ ఆమోదం పొందింది. యూనివర్శిటీ రెండవ దశ పనులలో భాగంగా నరసాపురం మండలంలోని బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ. 222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం మరియు పరిశోధనా కేంద్ర నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది.

Bandi Sanjay: కేసీఆర్‌కు సవాల్.. అది నిరూపిస్తే, రాజకీయ సన్యాసం తీసుకుంటా

మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు మరియు ఆక్వాకల్చర్‌ రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందబోతున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వాకల్చర్‌ రంగంలో పంట నష్టాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. తద్వారా దాదాపు సంవత్సరానికి రూ. 4,000 నుంచి 5,000 కోట్ల ఆర్ధిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది. అవసరమైన సంఖ్యలో ఫిషరీస్‌ డిప్లొమా, బీఎఫ్‌ఎస్‌సీ, ఎంఎఫ్‌ఎస్‌సీ, మరియు పీహెచ్‌డీ అర్హత గల అభ్యర్ధులను తయారుచేయడానికి ఆక్వా యూనివర్శిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు మరియు మత్స్య పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ యూనివర్శిటీ స్ధాపనతో ప్రొఫెషనల్‌ మ్యాన్‌ పవర్‌ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదంటున్నారు.

Exit mobile version