AP Elections 2026: ఎస్ఈసీ కీలక సమీక్ష.. ఆ మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా!

Ap Mptc And Zptc Elections

Ap Mptc And Zptc Elections

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక సమీక్ష నిర్వహించింది. మురసు తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణపై అధికారులు చర్చించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగైదు ప్రాంతాల్లో మినహా.. మిగతాచోట్ల పరిషత్‌ ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తుఫాన్ ప్రభావం కారణంగా వాయిదా వేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ సాయికాంత్ వర్మ చెప్పారు.

విజయవాడలో ఎస్‌ఈసీ అనిల్‌ చంద్రపునేఠా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిన్న నిర్వహించిన ఎన్నికల విధానం, మిగిలిన స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఎస్ఈసీ సమీక్షించింది. వర్షాలు తగ్గాయని, పరిమిత సంఖ్యలో మినహా మిగిలిన చోట్ల పోలింగ్‌కు ఇబ్బంది లేదని కలెక్టర్లు ఎస్‌ఈసీకి తెలిపారు. దీంతో నవంబర్‌ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు చర్యలకు తీసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఉంటే.. క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్ల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురణ ఇప్పటికే పూర్తయింది.