Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ధృవీకరణ ప్రక్రియలో మొత్తం ఓటర్లలో 89 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి అందినట్లు ఈసీ వెల్లడించింది. మిగిలిన 11 శాతం ఓటర్లలో కొందరు మరణించినట్లు, మరికొందరు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినట్లు, ఇంకొందరి ఆచూకీ లభించనట్లు గుర్తించినట్లు తెలిపింది.
ఈ ముసాయిదా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,71,38,182 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే 44,89,512 మంది ఆచూకీ లేని ఓటర్ల ప్రత్యేక జాబితాను కూడా ఈసీ విడుదల చేసింది. వీరిలో 15 లక్షలకు పైగా మంది మరణించిన ఓటర్లు, 22 లక్షలకు పైగా మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, సుమారు 7 లక్షల మంది డూప్లికేట్ లేదా డబుల్ ఎంట్రీ ఓటర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆచూకీ లేని ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించేందుకు ఆగస్టు 30 వరకు అవకాశం కల్పించారు. అందిన అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన అనంతరం సవరణల ప్రక్రియను సెప్టెంబర్ 28 వరకు పూర్తి చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.
ముసాయిదా జాబితాలో ఉన్న ఓటర్లు తమ చిరునామాను మార్చుకునే అవకాశం కూడా ఈసీ కల్పించింది. అలాగే కొత్తగా ఓటు నమోదు చేసుకునే అర్హులైన వారు ఫామ్-6, వివరాల సవరణ లేదా చిరునామా మార్పు కోసం ఫామ్-8 సమర్పించవచ్చు. ఆధార్ కార్డు మాత్రమే కాకుండా ఎన్నికల సంఘం సూచించిన ఇతర గుర్తింపు పత్రాలతో కూడా ఓటరు నమోదు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అలాగే 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ కాని ఓటర్లకు ప్రత్యేక నోటీసులు జారీ చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది. తగిన ఆధారాలు సమర్పించిన వారికి ఓటరు జాబితాలో పేరు చేర్చే అవకాశం ఉంటుందని తెలిపింది.
ఈ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 4న అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను కూడా ఆయా రాజకీయ పార్టీలకు అందజేయనున్నట్లు ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే ముసాయిదా జాబితాలో అత్యధిక ఓటర్లు కర్నూలు జిల్లాలో 18,12,532 మంది ఉండగా, అనంతపురంలో 17,90,436, విశాఖపట్నంలో 17,82,800, శ్రీకాకుళంలో 17,24,896, నెల్లూరులో 16,83,557 మంది ఉన్నారు. ఆచూకీ లేని ఓటర్ల జాబితాలో మాత్రం నెల్లూరు జిల్లా 2,90,683 మందితో అగ్రస్థానంలో ఉంది. అనంతరం తిరుపతి జిల్లాలో 2,87,835 మంది, కర్నూలులో 2,73,587 మంది, అనంతపురంలో 2,48,087 మంది, వైఎస్సార్ కడప జిల్లాలో 2,44,919 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. మొత్తంగా, ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించింది.
ముసాయిదా జాబితాలో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాలు.
కర్నూలు – 18,12, 532
అనంతపురం – 17,90,436
విశాఖపట్నం – 17,82,800
శ్రీకాకుళం- 17,24,896
నెల్లూరు – 16,83,557
ఆన్ కలెక్టబుల్ జాబితాలో అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లాలు…
నెల్లూరు – 2,90,683
తిరుపతి – 2,87,835
కర్నూలు – 2,73,587
అనంతపురం-2,48,087
వైఎస్సార్ కడప -2,44,919

