NTV Telugu Site icon

AP CM Jagan: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష

Jaganmohan Reddy On Train Accident

Jaganmohan Reddy On Train Accident

AP CM Jagan: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో కలిసి.. ఈ ప్రమాద ఘటనపై ఆయన సమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం 237 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకూడా భారీగా ఉందని వివరించారు. సీఎం ఆదేశాలమేరకు తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం పరిధిలోని డీఆర్ఎం అధికారి నుంచి సమాచారం తెప్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో కూడా నిరంతరం టచ్‌లో ఉన్నామని వెల్లడించారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఒక బృందాన్ని ప్రమాదం జరిగిన బాలాసోర్‌ ప్రాంతానికి పంపించాలని సీఎం ఆదేశించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తోపాటు సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌, విశాఖలో కమర్షియల్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆనంద్‌, శ్రీకాకుళం జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌లతో కూడిన బృందం వెళ్తోందని అధికారులు తెలిపారు.

Read Also: AP CM Jagan: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

ప్రతి జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో కూడా ఎంక్వైరీ విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలతో ఆమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. రైల్వే అధికారులనుంచి అందిన ప్రయాణికుల పరిస్థితులపై ఆరాతీయడానికి, అలాగే ఎవరైనా ప్రయాణికుల బంధువులు, వారి సంబంధీకుల నుంచి సమాచారం వస్తే వెంటనే స్పందించేలా ఈ ఎంక్వైరీ విభాగాలు పనిచేయాలని సీఎం ఆదేశించారు. దీంతో పాటు ఒడిశా సరిహద్దులకు సమీపంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అవసరమైన పక్షంలో అంబులెన్స్‌లు పంపించడానికి సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు అవసరమైన పక్షంలో ఉత్తమ వైద్యం అందించడానికి విశాఖ సహా ఒడిశా సరిహద్దుల్లోని ఆస్పత్రులను సన్నద్ధంగా ఉంచాలని కూడా సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.