NTV Telugu Site icon

CM Chandrababu: పోలవరం ఏపీకి జీవనాడి.. పూర్తయితే కరవుకు చెక్‌ పెట్టినట్లే..

Chandrababu

Chandrababu

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి, వెన్నెముక లాంటిదని.. అది పూర్తయితే ఏపీ కరవుకు చెక్‌ పెట్టినట్లేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఉన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి, పోలవరం ఏపీకి రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ పోలవరం అని పేర్కొన్నారు. నీటి వాడుకలో మార్పులు చేస్తే పర్యావరణంలో కూడా మార్పులు వస్తాయన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఫ్లోరైడ్ పరిస్థితులు చూస్తున్నామన్నారు. రూ.55వేల కోట్లకు పోలవరం నిర్మాణ వ్యయం చేరిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం 7 మండలాలు ఏపీకి ఇవ్వాలని కోరానని.. కృష్ణా డెల్టాకు గోదావరిని తీసుకొచ్చి రెండు నదుల అనుసంధానం చేశామన్నారు.

Read Also: Minister Rama Naidu: గత ఐదేళ్ల పాలనలో పోలవరం 20 ఏళ్లు వెనక్కి పోయింది..

పంటకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నిర్ణయించామని తెలిపారు. కియా మోటార్ మొదటి యూనిట్ ప్రారంభించామని వెల్లడించారు. ఒక్కరోజులో 32215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేశామన్నారు. 414 రోజుల్లో బావర్ కంపెనీతో డయాఫ్రం వాల్ పూర్తిచేశామన్న చంద్రబాబు.. 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే‌‌.. మేం పోలవరం పూర్తి చేసే వాళ్లమని వెల్లడించారు. ప్రమాణ స్వీకారం చేస్తూనే పోలవరం ప్రాజెక్టును ఆపేశారని సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంపై మండిపడ్డారు. డయాఫ్రం వాల్ పైనుంచే వరదలు వెళ్లాయని.. ఐదేళ్ళ కష్టం మొత్తం సర్వనాశనం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి చెప్పకుండా ధృవీకరణలు పంపించారన్నారు.

కొత్త డయాఫ్రం వాల్ కట్టాలంటే 990 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. గత ప్రభుత్వంలో పోలవరం పనులపై పూర్తి నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పోలవరం పూర్తయితే 194 టీఎంసీల నీరు నిలిపే వాళ్లమన్నారు. తెలుగు గంగకు 15 టీఎంసీలకు 5 టీఎంసీలు ఇవ్వాలన్నారు. 45.72 మీటర్ల ఎత్తులోనే పోలవరం నిర్మాణం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో 41.15 మీటర్లు ఫేజ్ వన్ అన్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించిన ఘనత గత ప్రభుత్వానిదేనన్నారు. పోలవరం పూర్తయితే 960 మెగావాట్ల విద్యుత్ కూడా మనకు వచ్చే అవకాశం వస్తుందన్నారు. రూ.16493 కోట్లు 2019లో ఖర్చయిందని… రూ.4993 కోట్లు తరువాత ఖర్చు చేశారన్నారు. పోలవరం నిర్దిష్ట సమయానికి పూర్తి చేస్తామన్నారు. ఢిల్లీలో మొదటిసారి తాను మాట్లాడింది పోలవరం గురించేనని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రం నుంచీ రూ.12150 కోట్లు ఇప్పటికే మంజూరు చేశారని.. పూర్తయ్యే కొద్దీ విడతల వారీగా డబ్బులు ఇస్తారన్నారు. 2026 మార్చి నాటికి కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తామన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 1 ఫిబ్రవరి 2027,‌ ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్ 2 డిసెంబర్ 2027కి పూర్తవుతాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.