CM Chandrababu: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సమావేశం కొనసాగింది. నీతి ఆయోగ్ భేటీ అనంతరం కేంద్ర మంత్రితో సమావేశమై పోలవరం ప్రాజెక్టు అంశంపై చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని సీఎం చంద్రబాబు కోరారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవవే వచ్చాయని.. ప్రత్యేకంగా ఏదో ఇచ్చారన్నట్టు కొందరు రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Godavari-Sabari: కూనవరం సంగమం వద్ద ఉధృతంగా శబరి-గోదావరి నదులు
విభజన చట్టం రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయే అంటూ పేర్కొన్నారు. విభజన కంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాల్లో గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక రాష్ట్రాల కంటే వెనుకబడిందని వెల్లడించారు. ఏ మంత్రిత్వ శాఖ దగ్గరకు వెళ్లిన రాష్ట్రం వెనుకబడిన గణాంకాలే చూపిస్తున్నారని తెలిపారు. పోలవరం, అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపానని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచామని చెప్పుకొచ్చారు. ఏపీ కేబినెట్ చేసిన తీర్మానాన్ని అందజేశానని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ.12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని కోరానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.