NTV Telugu Site icon

AP Govt: మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి సర్కారు కసరత్తు

Chandrababu

Chandrababu

AP Govt: ఏపీలో మరో ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బీసీ ప్రొటెక్షన్ యాక్టు రూపకల్పనకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించనున్నామని, ఈ మేరకు బీసీ ప్రొటెక్షన్ చట్టం రూపకల్పనపై సీఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి సవిత వెల్లడించారు. చట్ట సభల్లో బీసీలకు ప్రాతినిథ్యం పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారన్నారు.

వంద మందితో ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న రూ.110 కోట్ల డైట్ ఛార్జీల బకాయిలు విడుదలకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రూ.20.52 కోట్ల కాస్మొటిక్ ఛార్జీల బకాయిల విడుదల నిర్ణయం తీసుకున్నామన్నారు. వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులకు రూ.10 కోట్లు.. వసతి గృహ విద్యార్థులకు వ్యక్తిగతంగా ఇస్తున్న ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, బెడ్డింగ్ మెటిరీయిల్ కోసం రూ.25 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. హాస్టల్‌లో డిజిటిల్ కంటెంట్‌తో విద్యా ప్రమాణాల పెంపుదలకు ఎస్‌ఆర్‌ శంకరన్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం జరిగిందన్నారు. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పుల నిమిత్తం కేంద్రం వాటా రూ. 133.78 కోట్లతో పాటు రాష్ట్ర వాటాగా రూ. 89.18 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాపథకం కింద నాణ్యమైన విదేశీ విద్యా సంస్థల్లో అత్యధిక మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Read Also: Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజ‌ర్వేష‌న్‌పై రేపు చ‌ర్చలు

చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలులో అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ భవనాల నిర్మాణానికి రూ. 8 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. మిగిలిన 23 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవన్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేపడతామని మంత్రి సవిత పేర్కొన్నారు. బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలపై నివేదికను కోరుతున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల బలోపేతానికి రూ.10 కోట్లు విడుదల చేస్తామన్నారు. బీసీ కార్పొరేషన్ పునర్వవస్థీకరించి.. బీసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి తెలిపారు. కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. బీసీ ఉప కులాలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు… వారి వృత్తులేంటి.. వారి తలసరి ఆదాయమెంత..? వంటి వివరాలకు సమగ్ర సర్వే చేస్తాం… ఈ సర్వే ఆధారంగా వారి ఆర్థిక పరిస్థితికి సమగ్ర కార్యాచరణ, ప్రణాళికులు సిద్ధం చేస్తామని మంత్రి సవిత చెప్పుకొచ్చారు.

“జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా రూ.100 కోట్లు రాబట్టడానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాం. బీసీ నుంచి పారిశ్రామిక వేత్తలు వచ్చే విధంగా వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేలా Entrepreneur Development Programmes ను రూపొందిస్తాం. బీసీ-ఏలో ఉన్న అత్యంత వెనుకబడిన కులాల అభివృద్ధికి SEED (Scheme for Economic Empowerment of Denotified & Seminomadic Tribes) అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తాం. బీసీల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచి పీఎం-విశ్వకర్మ పథకం వర్తింపజేసేలా చర్యలు. రాష్ట్రంలోని అన్ని బీసీ గురుకుల విద్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు. సీసీ కెమెరాలను ఆర్టీజీఎస్‌కు అనుసంధానం చేసి.. మోనిటరింగ్ చేస్తాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్మాణంలో ఉన్న 4 రెసిడెన్షియల్ స్కూళ్లు పూర్తి చేసి ఈ విద్యా సంవత్సంలోనే వినియోగంలోకి తెస్తాం.. ఇందుకోసం రూ.75 కోట్లు విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో 5 చోట్ల ఫ్యాకల్టీ డవలప్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన గురుకుల విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులు నేర్పిస్తాం. కులాల వారీగా తలసరి ఆదాయం ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను గుర్తించి వారి ఆర్థికాభివృద్ధికి సమగ్ర ప్రణాళి రూపొందిస్తాం. గత టీడీపీ ప్రభుత్వంలో 68 కాపు భవనాలకు అనుమతు మంజారు చేయగా, వాటిలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన 2 భవనాలను పూర్తి చేయడానికి రూ.2.36 కోట్లు విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నాం.మిగిలిన 66 కాపు భవనాల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తాం.” అని మంత్రి సవిత స్పష్టం చేశారు.