Mukesh Kumar Meena: ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య జరిగిన ఘర్షణపై సీరియస్‌గా స్పందించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా.. ఒంగోలు ఘర్షణపై రాత్రి నుంచి కలెక్టర్, ఎస్పీ తమతో టచ్‌లో ఉన్నారని తెలిపిన ఆయన.. ఈ గొడవపై పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా దృష్టికి కూడా తీసుకువెళ్లామని తెలిపారు.. అయితే, గోడవలకు కారణం అయిన వారిపై కచ్చితంగా కేసులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. స్టేట్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆద్వర్యంలో ఎంక్వైరీ చేసి తగు చర్యలు చేపడతామని తెలిపారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా..
కాగా, ప్రకాశం జిల్లా ఒంగోలులో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది.. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. ఇరుపార్టీల ప్రధాన నేతలు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందినవారికి గాయాలయ్యాయి.. ఒంగోలులోని సమత నగర్ లో ప్రారంభమైన ఈ గొడవ కాస్తా.. ఒంగోలు రిమ్స్ వరకు చేరింది.. అయితే, సమత నగర్ ప్రచారం నిర్వహించారు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య రెడ్డి.. అయితే, ఆమె ప్రచారాన్ని ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు అడ్డుకున్నారు. అపార్ట్ మెంట్ వద్ద మహిళలకు వైసీపీ కార్యకర్తలకు మాటామాట పెరగటంతో గొడవకు దిగారు ఇరు పార్టీల శ్రేణులు.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ ఎస్పీ కార్యాలయం వద్దకు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇక, ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. నన్ను టచ్ చేస్తే ఊరుకున్నా.. నా ఫ్యామిలీని టచ్ చేసినా కూడా ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మా కోడలిపై టీడీపీ శ్రేణులు నానా దుర్బాషలాడి దాడికి ప్రయత్నించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. ఒంగోలులో భయానక పరిస్దితులు సృష్టించి టీడీపీ లబ్ధిపొందాలని చూస్తోందని విమర్శించారు. గొడవ జరిగిన ప్రాంతానికి ఏం జరిగిందో సామాన్య వ్యక్తులను అడిగి తెలుసుకోవాలి.. ఐదేళ్ల క్రితం ఒంగోలు కమ్మపాలెంలో ఇదే తరహా ఘటనకు పాల్పడి అక్రమ కేసులు పెట్టారు.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదన్నారు బాలినేని. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా కుటుంబంపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం కరెక్టేనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని బాలినేని డిమాండ్ చేసిన విషయం విదితమే.