AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో మొత్తం 48 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు అర్నబ్ తుఫాన్ ప్రభావం, బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలపైనా మంత్రివర్గం చర్చించింది. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలవాలని సమావేశంలో నిర్ణయించారు. తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక ఎన్నికలపై కూడా సీఎం చంద్రబాబు మంత్రులకు, కూటమి నేతలకు పలు సూచనలు చేశారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో వివిధ శాఖలకు సంబంధించిన 48 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించిన మంత్రులు.. అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత సమర్థంగా కొనసాగించాల్సిన అవసరాన్ని సమీక్షించారు.
అర్నబ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలవాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చూడాలని చర్చించింది. బాధితులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి సారించాలని సూచించింది. రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి నేతలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కూటమిలోని అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలని, అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. స్థానిక స్థాయిలో ఏవైనా విభేదాలు ఉంటే వాటిని పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.
కూటమి నాయకుల మధ్య సమన్వయం పెంచుకోవడంతో పాటు ఎన్నికల సమయంలో పరస్పర సహకారంతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల గెలుపు కోసం క్షేత్రస్థాయిలో సమష్టిగా పనిచేయాలని, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నేతలకు చెప్పారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం నేతలకు చెప్పారు.

