కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్‌లు మంజూరు చేశామన్నారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు 2 లక్షల 60 వేలు, ఉచిత విద్యుత్‌కు 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గతంలో వేర్వేరు రేట్లకు ట్రాన్సఫార్మర్లు కొనుగోలు చేశారని, ఇక అలా లేకుండా చూస్తామని మంత్రి గొట్టిపాటి చెప్పారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల నేపథ్యంలో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు.
‘ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 వేల 336 వ్యవసాయ కనెక్షన్‌లు మంజూరు చేశాం. 22 వేల 709 కనెక్షన్‌లు రైతులకు ఇచ్చి వినియోగంలోకి తెచ్చాము. 69 వేల 70 కనెక్షన్‌లు పెండింగ్లో ఉంటే మరో 20 వేలు మంజూరుకు అనుమతి ఇచ్చాము. పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్రం ఇచ్చిన పీఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రప్రభుత్వం చేపడుతుంది అనగానే.. నాలుగున్నర లక్షలు కనెక్షన్‌లకు అవకాశం ఇచ్చారు. ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు 2 లక్షల 60 వేలు ఖర్చు చేస్తున్నాం. ఉచిత విద్యుత్‌కు 12 వేల 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు జరిగితే వెంటనే పిర్యాదు చేసి వివరాలు ఇస్తే తప్పనిసరిగా కొత్తవి ఇస్తాం. అసైన్డ్ ల్యాండ్లకు దొంగ కనెక్షన్‌లు ఇస్తున్నారు, వాటిని రద్దు చేస్తాం. ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు జరగకుండా అల్యూమినియంతో వైరింగ్ చేయిస్తున్నాం. డిస్కంలకు మధ్య రేట్లలో అతరం లేకుండా చూస్తాం.. గతంలో వేర్వేరు రేట్లకు ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేశారు, ఇక అలా లేకుండా చూస్తాం’ అని మంత్రి గొట్టిపాటి చెప్పారు.
