వన్డే ప్రపంచకప్ 2025ని భారత మహిళా జట్టు గెలుచుకుంది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించి.. మొదటిసారి మెగా టోర్నీ అందుకుంది. 2005, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడిన భారత్.. ఈసారి మాత్రం కప్ కల నెరవేర్చుకుంది. ఈ విజయంతో మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో భారత మహిళా జట్టు ట్రెండింగ్‌లో నిలిచింది. అంతేకాదు మరో విషయం కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది.
Also Read: Australia Squad: భారత్ టీ20 సిరీస్ నుంచి ట్రవిస్ హెడ్ ఔట్.. కారణం అదేనా?
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’. భారత్ తరపున క్రికెట్ ఆడాలనే కలను నెరవేర్చుకోవడానికి ఝులన్‌కు ఎదురైన అడ్డంకులను ఈ చిత్రంలో చుపించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఝులన్ గోస్వామిగా నటించారు. ప్రోసిత్ రాయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. కరిష్మా శర్మ నిర్మించారు. కొన్ని సమస్యల కారణంగా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో చక్‌దా ఎక్స్‌ప్రెస్ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మూవీకి సంబంధించి చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇప్పుడు మహిళల జట్టు ప్రపంచకప్ 2025 గెలిచిన నేపథ్యంలో జులన్ గోస్వామి బయోపిక్ రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి దర్శకనిర్మాతలు ఏ నిర్ణయం తీసుకంటారో.
