Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు

Anupama Parameshwaran

Anupama Parameshwaran

Anupama: ‘క్రేజీ కళ్యాణం’ సినిమా విశేషాలను పంచుకునే క్రమంలో అనుపమ పరమేశ్వరన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో వివాహం, కుటుంబ బంధాలు, మహిళల పాత్రపై ఉన్న మూస ధోరణులను ప్రశ్నిస్తూ ఆమె కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. వివాహంపై స్పందిస్తూ.. “పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదు, పిల్లల్ని కనండి అని నరేశ్ గారు గతంలో చెప్పారు కదా, మా ఇంట్లో కూడా మా అమ్మ నాతో అదే అంటుంది. నిజానికి నాకు పెళ్లికి ముందే ఒక బిడ్డ కావాలనే కోరిక ఉండేది. భవిష్యత్తులో నాకు అసలు పెళ్లవుతుందో లేదో నాకే స్పష్టత లేదు కానీ, ఒక పాపనో బాబునో పెంచుకోవాలనే కోరిక మాత్రం బలంగా ఉంది. అది అడాప్షన్ ద్వారానో లేదా ఐవీఎఫ్ ద్వారానో ఎలాగైనా సాధ్యమే కదా” అంటూ నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు.

అదేవిధంగా దాంపత్య జీవితంలో భార్యాభర్తల సమానత్వం గురించి మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకునేది ఉచితంగా వచ్చే పనిమనిషి కోసం కాదు. ఆడపిల్లల బాధ్యత కేవలం వంటింటికే పరిమితం కాకూడదు. బయటకు వెళ్లి అలిసిపోయి ఇంటికి వచ్చాక మహిళ ఒక్కతే వంటింట్లోకి వెళ్లి వంట చేయాల్సి రావడం, పురుషులు విశ్రాంతి తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఇంట్లో పనులను ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. కనీసం ఆమెకు తోడుగా నిలిచే భాగస్వామ్యం (పార్టనర్‌షిప్) ఉండాలి” అని తన ఆలోచనలను కుండబద్దలు కొట్టారు.