NTV Telugu Site icon

Anup Rubens : భలేగా సాగుతున్న అనూప్ రూబెన్స్!

Anup Rubens

Anup Rubens

Anup Rubens : నవతరం సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ తీరే వేరుగా సాగుతోంది. తనదైన బాణీలు పలికిస్తూ మురిపిస్తున్న అనూప్, అనువైన చోట నేపథ్య సంగీతం మాత్రమే సమకూరుస్తున్నారు. ఏది చేసినా తనదైన పంథాలో పదనిసలు పలికిస్తూ సరిగమలతో సావాసం చేస్తున్నారు అనూప్ రూబెన్స్. ఇప్పటికే దాదాపు 70 చిత్రాలకు స్వరాలు సమకూర్చిన అనూప్ కొన్ని వెబ్ సిరీస్ కూ బాణీలు కడుతున్నారు. కన్నడ చిత్రసీమలోనూ అనూప్ స్వరకల్పన జేజేలు అందుకుంది. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలోనూ అనూప్ బాణీలు వినిపించారు.

అనూప్ రూబెన్స్ అసలు పేరు ఈనోక్ రూబెన్స్ . 1980 ఏప్రిల్ 18న అనూప్ జన్మించారు. చిన్నతనంలోనే గిటార్, డ్రమ్స్ ప్లే చేస్తూ సాగారు. ఏదైనా ఉత్సవాల్లోనూ, చర్చిలోనూ ఆయన తన సంగీత విద్య ప్రదర్శిస్తూ వచ్చారు. అనుకోకుండా సినిమా రంగంవైపు అనూప్ దృష్టి సారించారు. ఆరంభంలో కొన్ని ఆల్బమ్స్ చేశారు. అప్పట్లో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ తేజ కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఆయనను కలుసుకున్న అనూప్ కు తాను తెరకెక్కించిన ‘జై’ సినిమాతో సంగీత దర్శకునిగా అవకాశం కల్పించారు తేజ. ఆ సినిమాలోని పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. తరువాత తేజ తాను తెరకెక్కించిన ‘ధైర్యం’ చిత్రానికీ అనూప్ కే స్వరకల్పన చేసే అవకాశం అందించారు. ఈ రెండు చిత్రాలతో అనూప్ కు ఓ గుర్తింపు లభించింది. పలువురు దర్శకులు అనూప్ కు అవకాశాలు కల్పించారు. ప్రతీసారి అనూప్ బాణీలు ఆకట్టుకున్నాయి. కానీ, అవసరమైన కమర్షియల్ సక్సెస్ దొరకలేదు.

విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రేమకావాలి’ మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే ఆది సాయికుమార్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్ర విజయంతో అనూప్ పై అనేక మంది దర్శకనిర్మాతలకు గురి కుదిరింది. సునీల్ ‘పూలరంగడు’, నితిన్ ‘ఇష్క్’, ఆది సాయికుమార్ ‘లవ్లీ’ చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో అనూప్ బాణీలకూ జనం జై కొట్టారు. ‘ఇష్క్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన నితిన్ తన ‘గుండె జారి గల్లంతయ్యిందే’కు కూడా అనూప్ నే ఎంచుకున్నారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం’కు స్వరకల్పన చేసే అవకాశం అనూప్ కు దక్కింది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల స్టార్ హీరోస్ నటించిన ఏకైక చిత్రం ‘మనం’కు సంగీతం సమకూర్చడం నిజంగా అనూప్ కు లభించిన అదృష్టమనే చెప్పాలి. నటనిర్మాత నాగార్జున తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుతూ ‘మనం’ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గానూ మలిచారు అనూప్. ఈ సినిమా అనూప్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిమ్ ఫేర్ అవార్డును అందించింది. అలాగే ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డుకు ఎన్నికయ్యేలా చేసింది.

అనూప్ బాణీలకు పట్టం కడుతూ ఎంతోమంది పేరున్న దర్శకులు తమ చిత్రాలకు సంగీతం చేసేందుకు ఎర్రతివాచీ పరచి ఆయనను ఆహ్వానించారు. బాలకృష్ణ ‘పైసా వసూల్’, జూ.యన్టీఆర్ ‘టెంపర్’, వెంకటేశ్, పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’, అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’, నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’, రానా ‘నేనే రాజు- నేనే మంత్రి’ వంటి జనరంజక చిత్రాలకు అనూప్ రూబెన్స్ బాణీలు దన్నుగా నిలిచాయి. ఇప్పటికీ తన దరికి వచ్చిన చిత్రాలకు న్యాయం చేయాలనే తపిస్తున్నారాయన. ప్రస్తుతం అనూప్ ‘కథలు’ అనే వెబ్ సిరీస్ కు స్వరకల్పన చేస్తున్నారు. “అహింస,దిల్ వాలా, విక్రమాదిత్య” వంటి చిత్రాలకు కూడా అనూప్ బాణీలు కట్టారు. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ అనూప్ సంగీతం కోసం వేచి ఉన్నాయి. భవిష్యత్ లోనూ అనూప్ బాణీలు భలేగా జనాన్ని ఆకట్టుకుంటాయని ఆశించవచ్చు.