Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్‌మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..

Draupadi Murmu

Draupadi Murmu

పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు, 2026’కి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పార్లమెంట్ ఉభయ సభలు ఈ సవరణ బిల్లును ఆమోదించిన కొన్ని రోజుల వ్యవధిలోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడటంతో ఇది చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

బహిరంగ పరీక్షల్లో పారదర్శకతను పెంచడం, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటం, విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. ఈ చట్టం పార్లమెంట్ ఆమోదం పొందిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చట్టాన్ని తీసుకురావడమనే ముఖ్యమైన ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. పేపర్ లీక్ మాఫియాతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా అడ్డుకోవడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పరీక్షా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ కొత్త సవరణ చట్టం ప్రకారం శిక్షలు అత్యంత తీవ్రంగా ఉంటాయి. పోటీ పరీక్షలలో అక్రమాలకు పాల్పడినా లేదా పేపర్ లీకేజీకి పాల్పడినా వ్యక్తిగత నేరస్తులకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు గరిష్టంగా రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అదేవిధంగా.. ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా (గ్యాంగ్ లేదా మాఫియా ద్వారా) నిర్ధారణ అయితే, కనిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 కోట్లకు తగ్గకుండా భారీ జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలను పొందుపరిచారు.