Antarvedi: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో దగ్ధమైన పాత రథం శకలాల నిమజ్జన కార్యక్రమాన్ని టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇవాళ నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిమజ్జనాన్ని నిలిపివేసినట్లు ఆలయ ఈవో ప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. శాస్త్రోక్త విధానాలు, ఆగమ నియమాల ప్రకారం మరింత చర్చించి, సరైన ముహూర్తంలో అత్యంత శాస్త్రబద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
Read Also: Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు వైరల్
అయితే, 2020 సెప్టెంబర్ 5న స్వామివారి కళ్యాణోత్సవ రథం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించగా, దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాత రథం శకలాలను ఆలయ ప్రాంగణంలో అలాగే ఉంచడం అరిష్ట సూచకమని, ఆగమ పండితులు, ఆలయ అర్చకులు సూచించడంతో, రథ శిథిలాలను నిమజ్జనం చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, దగ్ధమైన రథం స్థానంలో దేవస్థానం కొత్త రథాన్ని ఏర్పాటు చేసింది. పాత రథ శకలాల నిమజ్జనంపై దేవాదాయ శాఖ కార్యాచరణ ప్రకటించినా, ఆగమ నియమాలు, ముహూర్తాలపై విస్తృత చర్చలు జరిపిన అనంతరం, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నిమజ్జనాన్ని మరో ముహూర్తానికి వాయిదా వేశారు.
ఇక, నిమజ్జనానికి ముందు రథ శకలాలకు ఉదయం 7.30 గంటల నుంచి శాస్త్రోక్త పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, వాస్తుపూజ, పంచామృత ద్రవ్యాలతో ప్రోక్షణ, వాస్తు హోమం, అగ్నికరణ, పూర్ణాహుతి తదితర ఆగమ సంప్రదాయ శుద్ధి క్రతువులు నిర్వహించారు.
నిమజ్జన ప్రక్రియ ఎలా జరగాల్సిందంటే
కార్యక్రమం ప్రకారం రథ శకలాలను చిన్నచిన్న ముక్కలుగా చేసి, అన్నాచెల్లెమ్మ గట్టు వద్ద గోదావరి నదిలో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. ఆగమ సంప్రదాయం ప్రకారం కర్పూరంతో భస్మపటనం (దగ్ధ శకలాల దహనం) నిర్వహించి, చల్లారిన తరువాత ఆ భస్మాన్ని బోటు ద్వారా నదీ మధ్యకు తీసుకెళ్లి నదిలో కలిపేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై దేవస్థానం, దేవాదాయ శాఖ అధికారులు మాట్లాడుతూ “భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, పూర్తి స్థాయి ఆగమ నియమాలు, శాస్త్రోక్త ముహూర్తం ప్రకారం రథ శకలాల నిమజ్జనాన్ని నిర్వహిస్తాం” అని తెలిపారు. కానీ, అనివార్య కారణాలతో నిమజ్జనాన్ని ఇవాళ నిలిపివేశారు అధికారులు, తదుపరి తేదీ, ముహూర్తాన్ని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
