Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాల్లో వద్దన్నా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఒకరు గల్లంతయ్యారు. రాయికోడ్ మండలం కుస్నూర్ శివారులోని గుర్మిల వాగు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు దాటే ప్రయత్నం చేసిన కృష్ణ.. వరద ఉధృతికి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వరంగల్‌నూ వాన ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో పిడుగు పడి ఓ యువకుడు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం భారీ వర్షానికి తడిసిముద్దయ్యింది. ప్రధాన రహదారులు చెరువుల తలపించాయి.
Read Also: Ameesha Patel : పెళ్లయ్యాక అలా చేయమంటున్నారు.. షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన పవన్ బ్యూటీ
అటు, భారీ వర్షానికి అల్లూరి జిల్లా పాడేరు జలమడుగును తలపించింది. గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారి బొక్కెల్లు దగ్గర మత్స్య గడ్డ వాగు పొంగిప్రవహించడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. నేషనల్ హైవే 516 నిర్మాణపు పనులు జరుగుతున్న చోట బురదమయంగా మారడంతో రాకపోకలు కష్టతరంగా మారాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో వాన గండం ఉందంటూ వాతావరణశాఖ అలర్ట్ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తాతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అయితే, పగలంతా ఎండ.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎడతెరిపి లేకుండా.. రాత్రి అంతా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. దీంతో, వర్షం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు నరకం చూస్తున్నారు..
