NTV Telugu Site icon

Turkey Earthquake: టర్కీలో మరోసారి భూకంపం.. ఇప్పటికే 34 వేలు దాటిన మృతుల సంఖ్య

Earthquake

Earthquake

Turkey Earthquake: టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు కళ్లు చెమర్చేలా చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. టర్కీలోని కహ్రామన్‌మరాస్‌కు ఆగ్నేయం నుంచి 24 కి.మీ దూరంలో సంభవించిన 4.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఆదివారం పేర్కొంది. ఈ భూకంపం 15.7 కి.మీ లోతులో సంభవించినట్లు తెలిపింది.

గత దశాబ్ధ కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంతగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది ఇప్పటికే ఈ శతాబ్దంలో అత్యంత ఘోరమైన భూకంపాలలో ఒకటి, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గతం వారంలో 7.8 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా టర్కీ, సిరియాల్లో మరణించిన వారి సంఖ్య 34 వేలకు పైగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే చర్యలు కొనసాగుతున్నాయి. కాకుంటే ఇన్ని రోజుల తర్వాత శిథిలాల కింద ఉన్న వారందరూ కోలుకోవాలనే ఆశలు ప్రతిరోజూ తగ్గుతున్నాయని అధికారులు, వైద్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.1939లో రిక్టర్‌ స్కేలుపై 7 కంటే ఎక్కువా నమోదైన భూకంపం టర్కీని ఛిన్నాభిన్నం చేసింది. దాని తర్వాత టర్కీలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇదే. భూకంపం కారణంగా 12,141 భవనాలు ధ్వంసమయ్యాయని లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

Turkey-Syria Earthquakes: టర్కీ, సిరియాలో 33 వేలు దాటిన భూకంప మృతులు

ఓ వైపు భూకంప బాధితుల్ని టర్కీ ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. మృతదేహాలు, క్షతగాత్రుల వద్ద నుంచి నగలు, నగదు దోచుకుంటున్నారు. బాధితులను దోచుకోవడం లేదా మోసం చేయడానికి ప్రయత్నించినందుకు డజన్ల కొద్దీ మందిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర మీడియా తెలిపింది. ఓ వైపు సహాయక చర్యలు జరుగుతుండగా మరోవైపు దొంగలు మృతదేహాల వద్ద ఆభరణాలు, నగదు దోచుకుంటున్నారు. దుకాణాల్లో చొరబడి దొరికింది దొరికినట్లు ఎత్తుకెళ్తున్నారు. మరికొందరు భూకంపం బాధితుల్ని ఆదుకుంటామని చెబుతూ మోసం చేస్తున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన టర్కీ పోలీసులు 48 మందిని అరెస్టు చేశారు. హటే ప్రావిన్స్‌లో దోపిడీలకు పాల్పడిన 42 మందిని, గజియాటెంప్‌లో ఆరుగురు మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

టర్కీ, సిరియా అంతటా కనీసం 870,000 మందికి అత్యవసరంగా భోజనం అవసరమని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఒక్క సిరియాలోనే దాదాపు 5.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 26 మిలియన్ల మంది ప్రజలు భూకంపం వల్ల ప్రభావితమయ్యారు. డజన్ల కొద్దీ ఆసుపత్రులు దెబ్బతిన్న తరువాత తక్షణ ఆరోగ్య అవసరాలను ఎదుర్కోవటానికి 42.8 మిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం విజ్ఞప్తి చేసింది. టర్కీకి చెందిన విపత్తు ఏజెన్సీ 8,294 మంది అంతర్జాతీయ రక్షకులతో పాటు టర్కీ సంస్థల నుండి 32,000 మందికి పైగా శోధన, రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించే పని చేస్తున్నారని చెప్పారు. కానీ, చాలా ప్రాంతాలలో, రెస్క్యూ టీమ్‌లు తమకు సెన్సార్లు, ఇతర అధునాతన శోధన పరికరాలు లేవని చెప్పారు. అంటే వారు తరచుగా పారలతో లేదా వారి చేతులతో ధ్వంసమైన భవనాలను జాగ్రత్తగా తవ్వుతున్నారు. ఇజ్రాయెల్ అత్యవసర సహాయ సంస్థ ఆదివారం టర్కీలో భూకంప సహాయక చర్యలను నిలిపివేసినట్లు తెలిపింది. ఆ దేశ సిబ్బందికి ముఖ్యమైన భద్రతా ముప్పు కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు.