NTV Telugu Site icon

AP Elections 2024: కౌంటింగ్ సందర్భంగా ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు.. పోలీసుల వార్నింగ్‌

Police

Police

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగిన విషయం విదితమే.. అయితే, ఫలితాల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తోంది పోలీస్‌యంత్రాంగం.. ఓట్ల కౌంటింగ్ సందర్భంగా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్… అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ లో పోలీసు బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు కానీ.. కౌంటింగ్ అనంతరం కానీ.. ఘర్షణలు జరిగితే ఎలా అణచివేయాలో కళ్ళకు పట్టినట్లు పోలీసులు వివరించారు. జన సమూహం రెచ్చిపోయినప్పుడు లేదా రాళ్లదాడి జరిగినప్పుడు ఎలాంటి చర్యలు చేపడతారన్నది పోలీసులు వివరించారు.

కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడరాదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు . కౌంటింగ్ రోజు ఎటువంటి ఘర్షణలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ హెచ్చరించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలనీ ఆయన కోరారు. కౌంటింగ్ రోజున రాయచోటిలో 144 సెక్షన్ విధించామన్నారు. కౌంటింగ్ ముందు రోజే ఇతర ప్రాంతాలకు చెందిన వారు రాయచోటిని వదిలి వెళ్లాలంటూ ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పి రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరోవైపు చిత్తూరు జిల్లా పుంగనూరులో సెబ్ అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు కీలక సూచనలు చేశారు. ప్రజలు పట్టణంలో నిర్భయంగా ఉండాలని సూచించిన ఆయన.. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసినది. అనంతరం ప్రధాన ఘట్టం జూన్ 4 వతేది న కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఎదురైన ఉద్రేకాలకు లోను కాకూడదని తెలిపారు. ప్రజలకు అండగా మేమున్నాం అంటూ శుక్రవారం పుంగనూరు గోకుల్ సర్కిల్ లో సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ తో కవాతు నిర్వహించారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు సహనం తో ఉండాలని సూచించారు. సోషల్‌ మీడియాలో ఫలితాలు వెలువడిన ఎవ్వరు కవ్వింపు చర్యలకు ప్రయత్నం చేయరాదని తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు పట్టణంలో ప్రజలకు ధైర్యం చేకూర్చడానికి కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఇంచార్జి డీఎస్పీ విష్ణు రఘు వీర్, సీఐ రాఘవరెడ్డి, ఎస్.ఐ. రఫీ తదితరులు పాల్గొన్నారు.