Anjan Kumar Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం నలుగురు అభ్యర్థుల పేర్లను ఏఐసీసీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయగా నవీన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఈ అంశంలో సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అలిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ చర్యలతో మనస్తాపం చెందినట్లు సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. పార్టీలో తాను చాలా సీనియర్ అని.. తానెప్పుడూ ఓడిపోలేదన్నారు. తనను అందరూ కలిసి ఓడగొట్టారని ఆరోపించారు. కష్టకాలంలో ఉన్న నన్ను మంచి కాలంలో పక్కన పెడతారా? అని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇస్తే గెలిచే వాడినన్నారు. కరోనాతో వెంటిలేటర్ పైన వైద్యం చేయించుకున్నా.. కష్ట కాలంలో పార్టీ కోసం పని చేశాను.. నర్సరీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు చేపట్టాను.. నేను రెండు సార్లు హైదరాబాద్ అధ్యక్షుడిగా పని చేశానని గుర్తు చేశారు.
READ MORE: Pakistan Violence: పాకిస్తాన్లో అల్లర్లు.. మునీర్, షెహబాజ్ అమెరికాకు తొత్తులు..
మరోవైపు.. జూబ్లీహిల్స్ లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని భావించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్ వేరే వాళ్ళకి కేటాయించిందన్నారు.. ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్, వివేక్, తాను వారి ఇంటికి వచ్చి మాట్లాడినట్లు తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అన్నారు.. రెండు సార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ,రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడుగా పని చేశారని గుర్తు చేశారు.. కరోనా సమయంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి ఆయన కూడా కరోనా బారిన పడ్డారన్నారు.. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అంజన్ కుమార్ యాదవ్ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు.. వారి హయాంలో నగరంలో పార్టీ మరింత అభివృద్ధి చెందేలా ముందుకు పోతున్నామని తెలిపారు.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు..
