NTV Telugu Site icon

Malaika Arora: ఆత్మహత్య చేసుకునేముందు.. మలైకా అరోరాకు ఫోన్‌ చేసిన ఆమె తండ్రి!

Anil Arora Malaika Arora

Anil Arora Malaika Arora

బాలీవుడ్‌ సీనియర్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్‌ అరోరా (65) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం బాంద్రాలోని తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అనిల్‌ అరోరా మరణించిన సమయంలో పుణెలో ఉన్న మలైకా.. విషయం తెలిసిన వెంటనే ముంబై చేరుకున్నారు. ఘటన జరిగిన చోట ఎలాంటి సూసైడ్‌ నోట్ లభించలేదు. అనిల్‌ అరోరా మృతికి సరైన కారణాలు తెలియరాలేదు. అయితే ఆత్మహత్య చేసుకునేముందు ఆయన తన కుమార్తెలకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్య చేసుకునేముందు అనిల్‌ అరోరా తన ఇద్దరు కుమార్తెలు మలైకా, అమృతకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, పూర్తిగా అలసిపోయానని కూతుళ్లతో చెప్పినట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలను భరించలేని కారణంగానే.. అనిల్‌ అరోరా మరణించినట్లు అర్ధమవుతోంది. ఘటన జరిగిన చోట ఎలాంటి సూసైడ్‌ లేఖ లభించలేదని, పంచనామా పూర్తయ్యాకే అనిల్‌ అరోరా మరణానికి సంబంధించిన స్పష్టమైన కారణం తెలుస్తుందని బాంద్రా పోలీసులు తెలిపారు.

Also Read: MG Windsor EV Price: ‘ఎంజీ విండ్‌సోర్‌’ ఈవీ వచ్చేసింది.. లగ్జరీ, భద్రత మరో లెవల్!

తండ్రి మరణం అనంతరం బాధలో ఉన్న మలైకా అరోరా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘మా నాన్న మరణం మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి. కుటుంబం పట్ల ఎంతో ప్రేమగా ఉండేవారు. నాన్న ఇక లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది మాకు తీరని నష్టం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను భంగం కలిగించొద్దని మీడియాను కోరుతున్నా’ అని ఇన్‌స్టాలో మలైకా పేర్కొన్నారు. పంజాబ్‌కు చెందిన అనిల్ అరోరా గతంలో మర్చంట్ నావీలో పనిచేశారు. మలైకాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. మలైకా, అమృతలు తన తల్లి జాయిస్ పాలీకార్ప్ వద్ద పెరిగారు.

Show comments