Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!

Angkrish Raghuvanshi

Angkrish Raghuvanshi

Angkrish Raghuvanshi: ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీ వివాదంలో చిక్కుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్‌ లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (Code of Conduct) ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ కూడా విధించారు.

ఐపీఎల్ అధికారిక ప్రకటన ప్రకారం.. లెవల్-1 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ శిక్ష విధించబడింది. మ్యాచ్‌ లో జరిగిన సంఘటన తర్వాత రఘువంశీ తన అసంతృప్తిని బయటపెడుతూ బౌండరీ రాప్ పై బ్యాట్ తో కొట్టడం ఈ చర్యలకు కారణమైంది. ఈ వివాదానికి కారణమైన సంఘటన ఐదో ఓవర్‌ లో జరిగింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో రఘువంశీ షాట్ ఆడిన తర్వాత సింగిల్ కోసం పరుగెత్తాడు. అయితే మధ్యలోనే కామెరాన్ గ్రీన్ అతన్ని తిరిగి పంపించాడు. క్రీజ్‌ లోకి చేరేందుకు పరుగెత్తే సమయంలో రఘువంశీ తన పరుగుల దిశను మార్చినట్లు కనిపించింది.

ఈ సమయంలో అతను చేసిన “యూ-టర్న్” కారణంగా బంతి స్టంప్స్‌ను తాకకుండా అతని కాలి వద్ద తగిలింది. దీంతో ఎల్‌ఎస్‌జీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా, టీవీ అంపైర్ రీప్లేలను పరిశీలించి అతని దిశ మార్పు ఉద్దేశపూర్వకమని భావించి “obstructing the field”గా ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రఘువంశీ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో కేకేఆర్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఇరుజట్లు 20 ఓవర్లలో 155 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్‌లో లక్నో జాయింట్స్ కేవలం 1 పరుగు మాత్రమే చేయగా, కేకేఆర్ మొదటి బంతికే ఛేదించి విజయాన్ని అందుకుంది.