NTV Telugu Site icon

Angelo Mathews Wicket: నా పదిహేనేళ్ల కెరీర్‌లో.. ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదు: మాథ్యూస్‌

Angelo Mathews

Angelo Mathews

Angelo Mathews Slams Shakib Al Hasan and Bangladesh Team over Controversial Timed Out dismissal: శ్రీలంక సీనియర్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ బంగ్లాదేశ్‌ జట్టుపై మండిపడ్డాడు. తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదన్నాడు. బంగ్లా ఆటగాళ్లకు, అంపైర్ల కామన్‌సెన్స్‌ ఏమైందో తెలియదన్నాడు. తనకు ఇంకా సమయం ఉన్నా టైమ్ ఔట్‌గా ప్రకటించారని, వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నట్లు తెలిపాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాథ్యూస్‌ టైమ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. క్రీజ్‌లోకి వచ్చి గార్డ్‌ తీసుకోకుండానే.. హెల్మెట్‌ కోసం వేచి చూశాడు. దీంతో బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌ హల్ హాసన్ ఔట్‌ కోసం అప్పీలు చేయగా.. అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో మాథ్యూస్‌ డగౌట్‌కు వెళ్లిపోయాడు.

మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏంజెలో మాథ్యూస్‌ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ‘నేను తప్పు చేయలేదు. బ్యాటింగ్‌ కోసం రెండు నిమిషాలకు ముందే సిద్ధమయ్యా. హెల్మెట్ సరిగా లేని విషయం బంగ్లా ఆటగాళ్లకు, అంపైర్లకు చెప్పా. వారి కామన్‌సెన్స్‌ ఏమైందో. కెప్టెన్ షకిబ్‌, బంగ్లా జట్టు నుంచి అవమానకర ప్రతిస్పందన వచ్చింది. బంగ్లా ఇదే విధంగా క్రికెట్‌ ఆడాలనుకుంటే.. ఆ స్థాయికి దిగిపోండి. ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. నేను రెండు నిమిషాల్లోపు బ్యాటింగ్‌ కోసం సిద్ధంగా ఉండకపోతే.. ఔటని నిబంధనలలో ఉంది. నాకు ఇంకా ఐదు సెకన్ల సమయం ఉంది. నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి. నేను మన్కడింగ్‌, ఫీల్డర్‌ను అడ్డుకోవడం వంటి వాటి గురించి మాట్లాడటం లేదు’ అని మాథ్యూస్‌ తెలిపాడు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోకపోవడంపై ఏంజెలో మాథ్యూస్‌ స్పందిస్తూ… ‘కరచాలనం చేసుకోకపోవడం పెద్ద విషయం కాదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునేది. మీరు ఇతరుల నుంచి గౌరవం పొందాలనుకుంటే.. ముందు మీరు కూడా అలాంటి గౌరవమే ఇవ్వాలి. ఇతరులకు గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించినప్పుడు.. మీరేం అది అడగలేరు కదా?. బంగ్లా కెప్టెన్‌ షకిబ్‌, ఆ జట్టు పట్ల ఉన్న గౌరవం ఇప్పుడు పోయింది’ అని పేర్కొన్నాడు.

Also Read: Hashmatullah Shahidi: భారత అభిమానుల వల్లే ఈ విజయాలు.. రుణపడి ఉంటాం: అఫ్గాన్‌ కెప్టెన్‌

‘మైదానంలో ఇరు జట్లూ విజయం కోసమే పోరాడతాయి. నిబంధలను పాటించడం మంచిదే కానీ.. నేను రెండు నిమిషాల్లోపే సిద్ధంగా ఉన్నా. అది చెప్పడానికి నా వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయి. వాటిని తర్వాత బయటపెడతాం. వికెట్‌ పడినప్పటి నుంచి నేను క్రీజ్‌లోకి వచ్చేవరకూ తీసుకున్న సమయం ఎంతనే ఆధారాలతోనే మాట్లాడుతున్నా. నా పదిహేనేళ్ల కెరీర్‌లో ఇంత దిగజారిపోయిన జట్టును ఎప్పుడూ చూడలేదు. అంపైర్లు కూడా మంచి నిర్ణయం తీసుకోవాల్సింది. నేను క్రీజ్‌లో ఉండుంటే.. మా జట్టు గెలిచేదని నేను చెప్పడం లేదు. నేను కావాలని హెల్మెట్‌ స్ట్రిప్‌ను లాగలేదు. ఏదేమైనా బంగ్లా జట్టు వ్యవహరించిన తీరు బాగాలేదు. ఇది నన్ను షాక్‌కు గురి చేసింది. మరే జట్టు కూడా ఇలా ఆలోచించదు’ అని మాథ్యూస్‌ చెప్పుకొచ్చాడు.