Andhra Pradesh Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వాతావరణం మారనుంది. వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రస్తుతం భూ ఉపరితలంపై ప్రవేశించిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు పయనించే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ పి.ఎల్.ఎన్. మూర్తి వెల్లడించారు. దీనికి తోడు రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా సదరు అల్పపీడనం వరకు నైరుతి రుతుపవన ద్రోణి కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని వివరించారు. ఈ వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, రానున్న నాలుగు రోజుల పాటు ఉత్తర కోస్తా తీర ప్రాంత మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. అల్పపీడన తీవ్రత దృష్ట్యా కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని ప్రధాన ఓడరేవులలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
AP Weather Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలు అప్రమత్తం!

Ap Weather Report Today
