Site icon NTV Telugu

Andhra Pradesh: పెట్టుబడుల్లో దేశంలోనే ఏపీ టాప్.. విస్తుపోయే గణాంకాలు..

Ap News

Ap News

Andhra Pradesh Tops India in Investment Attraction with 25% Share: దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దేశ పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతానికి పైగా వాటాను దక్కించుకుని ఏపీ మరోసారి తన సత్తాను చాటింది. పారిశ్రామిక వృద్ధిలో ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు కేంద్రబిందువుగా మారిందని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసిన ‘గ్రాఫిక్ ఆఫ్ ది డే’లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రస్తావించింది. పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా ఏపీ ఎదుగుదల ఉందని ఫోర్బ్స్ ఇండియా ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని ఆ గ్రాఫిక్ వెల్లడించింది.

READ MORE: Ranveer Singh-Dhurandhar: ‘ధురంధర్’ తుఫాను మధ్య.. రణవీర్ రొమాంటిక్ కామెడీ మూవీ వచ్చేస్తోంది!

ఫోర్బ్స్ ఇండియా ట్వీట్‌ను కోట్ చేస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. “ఇతర రాష్ట్రాలను అనుసరించడం కాదు.. ఆంధ్రప్రదేశ్ ముందుండి నడిపిస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీ బెస్ట్ ఎగ్జాంపుల్” అని ఆయన ట్వీట్ చేశారు. పెట్టుబడిదారుల తొలి ఎంపికగా ఆంధ్రప్రదేశ్ మారుతోందని పేర్కొన్నారు. సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతులు, పారిశ్రామిక అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు ఏపీని పెట్టుబడులకు హాట్‌స్పాట్‌గా మార్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ MORE: Ducati Panigale V4 R: యూత్ డ్రీమ్ బైక్.. సరికొత్త డుకాటి పానిగేల్ V4 R రిలీజ్.. ధర ఎంతంటే

కొత్త ఏడాదికి ఆంధ్రప్రదేశ్‌కు పర్ఫెక్ట్ స్టార్ట్ దక్కిందని, భారీ పెట్టుబడులతో రాష్ట్రం శుభారంభం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. FY26 తొలి తొమ్మిది నెలల్లో ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాను దక్కించుకుని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలు ఏపీ ఇండియాకు ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా అవతరిస్తోందని స్పష్టంగా సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తూర్పు, దక్షిణ కారిడార్ల వైపు ఇండస్ట్రియల్ మోమెంటం వేగంగా మారుతుండటం రాష్ట్ర భవిష్యత్‌కు శుభ సూచకమని మంత్రి తెలిపారు. ఒడిశా (13.1 శాతం), మహారాష్ట్ర (12.8 శాతం)తో కలిసి కేవలం మూడు రాష్ట్రాల్లోనే 51.2 శాతం పెట్టుబడులు కేంద్రీకృతమవడం గమనార్హమన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముందుండి నడుస్తుండటం రాష్ట్రానికి పెట్టుబడిదారులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషించిన మంత్రి నారా లోకేష్‌కు నాదెండ్ల మనోహర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. నిరంతర ప్రయత్నాలు, స్పష్టమైన విధానాలే ఈ విజయానికి కారణమని ప్రశంసించారు. అలాగే టీ.జి. భరత్‌కు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడే రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరుగుతున్న సమిష్టి కృషి వల్లే రాష్ట్రం పెట్టుబడుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుందని మంత్రి పేర్కొన్నారు.

Exit mobile version