ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంతలు లేని రహదారులే లక్ష్యంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుంతలు రహిత ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా కీలక అడుగులు వేస్తూ, ఈ బృహత్తర లక్ష్యంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నం చేస్తోంది. రోడ్డు మీద ఎక్కడైనా గుంత కనిపిస్తే దాన్ని వెంటనే మనమిత్ర ద్వారా ప్రభుత్వానికి షేర్ చేయాలని, ఫిర్యాదు చేసే సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం పౌరులను కోరింది. తమ ప్రాంతంలోని రోడ్లపై గుంతలు కనిపిస్తే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 9552300009కు పంపాలని సూచించింది. ఈ మేరకు మనమిత్రలో పౌరులకు సులభంగా అందుబాటులో ఉండేలా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది.
ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి పౌరులు ముందుగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత అందులో కనిపించే సేవల ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం పాట్‌హోల్ గ్రీవెన్సెస్ ఆప్షన్‌ను ఎంచుకుని, అందులో రిజిస్టర్ పాట్‌హోల్ గ్రీవెన్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ప్లీజ్ ఫిల్ ది ఫామ్ ఆఫ్ పాట్‌హోల్ గ్రీవెన్స్ టు సబ్మిట్ యువర్ కంప్లైంట్ అనే సందేశం వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి ప్రక్రియను కొనసాగించాలి. ముందుగా ఆధార్ వెరిఫికేషన్ కోసం తమ ఆధార్ నెంబరును నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత తమ ప్రాంతంలో రోడ్డుమీద ఉన్న గుంత ఫొటో తీసి అప్లోడు చేయాలి. చివరగా ఆ గుంత ఉన్న ప్రాంతం కరెంట్ లొకేషన్ షేర్ చేస్తే సరిపోతుంది.
మీరు పంపిన ఫొటో, లొకేషన్ వివరాలతో కూడిన సమస్యపై గ్రీవెన్స్ నమోదైనట్లు మీకు సమాచారం అందుతుంది. ఈ ఫిర్యాదు వెంటనే సంబంధిత శాఖకు వెళుతుంది. దానిపై ఆ శాఖ తక్షణమే స్పందించి, ఆ గుంతలను పూడ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంటుంది. గుంతలు లేని రహదారులుగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. రహదారుల భద్రత, మెరుగైన ప్రయాణ సౌకర్యాల కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా చురుకుగా భాగస్వాములు కావాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

