TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసుపై దాఖలైన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా స్వామివారి కానుకల లెక్కింపులో పారదర్శకత తప్పనిసరి అని న్యాయస్థానం స్పష్టం చేసింది. భక్తులు సమర్పించే ప్రతి పైసా లెక్క సరిగ్గా ఉండాలని, దొంగతనాలు, మోసాలు జరగకుండా చూసే పూర్తి బాధ్యత టీటీడీ బోర్డుపై ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో గత విచారణలో పరకామణి లెక్కింపు వ్యవహారంపై సలహాలు ఇవ్వమన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌ను కోర్టు ప్రశ్నించింది. పరకామణి లెక్కింపులో ఇప్పటికీ సంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయా? ఆధునిక సాంకేతికత వినియోగంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని న్యాయస్థానం నిలదీసింది.
భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ఏ చిన్న లోపం జరిగినా తీవ్ర ప్రభావం ఉంటుందని హైకోర్టు పేర్కొంది. అందుకే టీటీడీలో స్వామివారి కానుకల లెక్కింపులో AI టెక్నాలజీ, కంప్యూటర్లు, డిజిటల్ రికార్డింగ్ వ్యవస్థలు వినియోగించాలని ఆదేశించింది. లెక్కింపు, పర్యవేక్షణ, రికార్డుల భద్రత అన్నీ ఆధునిక సాంకేతికతతోనే జరగాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2025 అక్టోబర్ 27న జరిగిన ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే ఒక సమగ్ర ముసాయిదా (డ్రాఫ్ట్ ప్లాన్) రూపొందించి, రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని టీటీడీ బోర్డును ఆదేశించింది. అలాగే ప్లాన్–Bపై కూడా ఎనిమిది వారాల్లోగా ప్రత్యేక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
Read Also: Car On Railway Track: ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్‌పైకి మహీంద్రా థార్ .. కారు నడిపిన 65 ఏళ్ల వృద్ధుడు
ఇదే సమయంలో డీజీపీ, ఏసీబీకి ఇచ్చిన గత ఆదేశాల మేరకు సీవీ రవికుమార్ ఆస్తులపై జరుగుతున్న విచారణపై కూడా హైకోర్టు ప్రశ్నించింది. రవికుమార్ లేదా ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు, విక్రయించిన భూములు తదితర వివరాలపై ఒక వారంలో విచారణ పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన హైకోర్టు.. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.