NTV Telugu Site icon

YS Jagan Vizag Tour: నేడు విశాఖకు సీఎం జగన్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

Ys Jagan

Ys Jagan

YS Jagan Vizag Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు వివిధ శాఖలపై సమీక్ష సమావేశాల నిర్వహిస్తోన్న ఆయన.. మరోవైపు సంక్షేమ పథకాలను కూడా ప్రారంభిస్తున్నారు.. వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ.. ఒక్కో పథకానికి సంబంధించిన డబ్బును బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మరోవైపు జిల్లాల్లో పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు.. కాగా, ఈ రోజు విశాఖలో పర్యటించనున్నారు సీఎం వైఎస్‌. విశాఖ పర్యటనలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఏపీ సీఎం.. ఇక, ఈ పర్యటన కోసం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఉదయం 10.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.15 గంటలకు కైలాసపురం పోర్టు ఆసుపత్రి వద్దకు చేరుకుంటారు. అక్కడ ఇనార్బిట్‌ మాల్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం హైటీ కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టనున్న 50 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

Read Also: ITR Logins: ఐటీఆర్ ఫైలర్ల సంఖ్యను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్థిక మంత్రి.. కారణం తెలిస్తే షాక్

ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 12.25 గంటలకు బయలుదేరి సిరిపురం కూడలిలోని ఏయూ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఎలిమెంట్‌ ఫార్మా ఇంక్యుబేషన్‌, బయో మోనిటరింగ్‌ హబ్‌తో పాటు మరో నాలుగు భవనాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.50 గంటలకు ఏయూ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.20 గంటలకు కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి బయలుదేరి 1.40 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.50 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరనున్న సీఎం జగన్‌.. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.