NTV Telugu Site icon

Vizianagaram Train Accident: విజయనగరం రైలు ప్రమాద బాధితులకు సీఎం పరామర్శ.. అండగా ఉంటామని భరోసా..

Ys Jagan

Ys Jagan

Vizianagaram Train Accident: విజయనగరం జిల్లా కంటాకపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటికే 15 మంది మృతిచెందినట్టు గుర్తించారు అధికారులు.. తీవ్రగాయాపాలమైన చాలా మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.. ఇక, రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించారు సీఎం వైఎస్‌ జగన్‌.. తాడేపల్లి నుంచి విజయనగరం వెళ్లిన ఆయన.. మొదట విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి బయట రైలు ప్రమాదంపై అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు..

ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించాలనుకున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, ఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతోన్న నేపథ్యంలో.. రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు ఏపీ సీఎం.. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పోలీస్ శిక్షణ కళాశాల మైదానంలో వున్న హెలిప్యాడ్‌లో దిగారు.. ఆపై విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.. వారికి ధైర్యాన్ని చెప్పారు.. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.

కాగా, కంటాకపల్లి వద్ద ఆదివారం రైలు ప్రమాదం చోటు చేసుకుంది.. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్‌ రైలును వెనక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్‌ రైలు వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా.. 100 మందికి పై బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు.. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.. మరోవైపు.. ఈ ప్రమాదంలో మృతిచెందిన రాష్ట్ర వాసుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహాన్ని ప్రకటించారు సీఎం జగన్‌.. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.

మరోవైపు.. బాధితులను పరామర్శించిన తర్వాత సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు సీఎం వైఎస్‌ జగన్‌.. ”విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం.. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను.. వారు కోలుకునేంత వరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది.. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను.” అంటూ తన ట్వీట్‌ (ఎక్స్‌)లో రాసుకొచ్చారు.