Site icon NTV Telugu

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా.. ఎందుకంటే..?

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఈ నెల 31వ తేదీన జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది.. ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 31వ తేదీన అనగా రేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది.. దీనిపై గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రేపటి సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.. విజయనగరం రైలు ప్రమాద నేపథ్యంలో కేబినెట్‌ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది.. క్షతగాత్రుల సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, అధికారులు నిమగ్నమై ఉన్న నేపథ్యంలో కేబినెట్‌ సమావేశాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. అయితే, వచ్చే నెల అనగా నవంబర్‌ 3వ తేదీన కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

Read Also: KVP Ramachandra Rao: రాహుల్ ప్రధాని అవుతారు.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది..

కాగా, విజయనగరం జిల్లా కంటాకపల్లి వద్ద ఆదివారం రైలు ప్రమాదం చోటు జరిగిన విషయం విదితమే.. నెమ్మదిగా వెళ్తున్న పలాస ప్యాసింజర్‌ రైలును వెనక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్‌ రైలు వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా.. 100 మందికి పై బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఆస్పత్రికి వెళ్లిన క్షతగాత్రులను పరామర్శించిన సీఎం వైఎస్‌ జగన్‌.. తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. ఇక, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని హెలిక్యాప్టర్‌ ద్వారా పరిశీలించారు సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఇక, ఈ ప్రమాదంలో మృతిచెందిన రాష్ట్ర వాసుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహాన్ని ప్రకటించారు సీఎం జగన్‌.. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించిన విషయం విదితమే.. తన విజయనగరం పర్యటనలో.. మృతుల కుటుంబాలకు వెంటనే పరిహారం అందించేలా ఏర్పాట్లు చేయాలని.. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

Exit mobile version