ఉన్నవి ఆరు పదవులు…ఆశావహులు మాత్రం భారీగానే ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ…ఆ జిల్లా నుంచి ఎవరికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తుంది ? ఎవరికి ఏ అంశం కలసి వస్తుంది ? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడిదే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయ్యింది. ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలు…అధికార పార్టీకే దక్కుతాయి. దీనితో టిఆర్ఎస్ పార్టీలో ఆశావహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలు, జిల్లాలను పరిగణనలోకి తీసుకుని… అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన సీఎం కేసీఆర్…అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేసే ఛాన్స్ ఉంది.ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో…ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు ఉన్నారు. ఒకరు గుత్తా సుఖేందర్ రెడ్డి..మరొకరు నేతి విద్యాసాగర్. ఒకరు మండలిలో చైర్మన్…మరొకరు వైస్ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌లు…ఎమ్మెల్సీ పదవికి మళ్లీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా…పార్టీ నేత కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కోటి రెడ్డి…ఈ సారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారన్న ఆశల్లో ఉన్నారు. కర్నె ప్రభాకర్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డిలు…మండలి సభ్యత్వం కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆశావహులు ఎక్కువగా ఉండడంతో …పదవి యోగం ఎవరికి దక్కుతుందోనని టీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది.
