Anakapalli Road Accident: అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కళ్యాణి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కాలేజీకి వెళ్లేందుకు తండ్రితో కలిసి రోడ్డు పక్కన వేచి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఐరన్ రేకుల బండిల్స్‌తో వెళ్తున్న లారీ నుంచి భారీ ఇనుప రేకుల కట్ట ఒక్కసారిగా విద్యార్థినిపై పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కళ్యాణిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో కళ్యాణి తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనతో కళ్యాణి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదం కారణంగా రేగుపాలెం జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైవే సిబ్బంది, పోలీసులు కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. లారీ నుంచి రోడ్డుపై పడిన భారీ ఇనుప రేకుల రోల్‌ను క్రేన్ల సహాయంతో తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. విద్యార్థిని మృతితో రేగుపాలెం పరిసర ప్రాంతాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

