Amravati: మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. మరికొందరు చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నేడు తెల్లవారుజామున సుమారు 3:15 నుంచి 3:30 గంటల మధ్య ఆసుపత్రి మూడో అంతస్తులోని NICUలో ఈ ప్రమాదం జరిగింది. NICUలోని వెంటిలేటర్‌లో పేలుడు సంభవించిన అనంతరం మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 39 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు.
మంటలు చెలరేగిన వెంటనే విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే శిశువులను NICU నుంచి తరలించడంతో పలువురి ప్రాణాలను కాపాడగలిగారు. అయితే ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు శిశువులను మెరుగైన చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం NICUలోని ఒక వెంటిలేటర్‌లో పేలుడు సంభవించిన తర్వాత మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. NICUలో మూడు విభాగాలు ఉండగా.. ఒక్కో విభాగంలో 13 మంది శిశువులకు చికిత్స అందించే సామర్థ్యం ఉంది.
ఈ ఘటనపై NCP నాయకురాలు సుప్రియా సూలే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. శిశువుల కోసం తల్లిదండ్రులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారని, అలాంటి సమయంలో తమ బిడ్డను ఈ విధంగా కోల్పోవడం వారి కుటుంబాలకు ఊహించలేని విషాదమని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ప్రమాదంగా చూడకుండా.. వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
#Maharashtra के अमरावती में जिला महिला अस्पताल के बेबी वार्ड में आग लगने से 3 नवजात बच्चों की मौत हो गई है..आज तड़के 3:30 बजे अचानक एक वेंटिलेटर में विस्फोट होने के बाद आग लगी..इस NICU में 39 नवजात बच्चों को रखा गया था..@TNNavbharat @AmtCityPolice pic.twitter.com/meH2Mrmh1p
— Atul singh (@atuljmd123) August 24, 2026

