Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రాజకీయంగా తీవ్ర ఆసక్తి రేపుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి పక్షాలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారానికి కౌంటర్‌గా బీజేపీ ఈ కార్యక్రమాలను చేపట్టింది. ఢిల్లీలో విపక్షాల మహా ర్యాలీ ముగిసిన మరుసటి రోజే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఈ భారీ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అమిత్ షా మధ్యాహ్నం 1:00 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కాకతీయ హోటల్లో బస చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయంలో మీడియా రంగానికి చెందిన ప్రముఖులు, సినీ ప్రముఖులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. విశ్రాంతి అనంతరం సాయంత్రం 4:00 గంటలకు అమిత్ షా ‘మహా పాదయాత్ర’లో పాల్గొంటారు.
ఈ పాదయాత్ర బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి మొదలు కానుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఈ రూట్‌ను పరిశీలించి పోలీసులతో సమీక్షించారు. పాదయాత్ర మార్గమంతటా బీజేపీ జెండాలు, బ్యానర్లు, హోర్డింగులు, ప్రజలు వీక్షించేందుకు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు చేసిన తీవ్ర విమర్శలకు హైదరాబాద్ నుంచే అమిత్ షా కౌంటర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టిన ఈ సభలో అమిత్ షా ఎలాంటి రాజకీయ సంకేతాలు ఇవ్వనున్నారు.? విపక్షాల ఆరోపణలను ఎలా తిప్పికొట్టనున్నారనే అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది.

