NTV Telugu Site icon

Amit Shah: ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక క్రమశిక్షణ అవసరం

Amit Shah

Amit Shah

Amit Shah: ఆర్థిక క్రమశిక్షణ, అవసరమైన చోట నిధులను సద్వినియోగ పరుచుకోవడం ద్వారానే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వేగవంతం అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ చైర్మన్ అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్రాల ఆదాయాల విషయంలోనూ ఇదే విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఎన్ఈసీ (ఈశాన్య రాష్ట్రాల మండలి) 70వ ప్లీనరీ ముగింపు సమావేశంలోఅమిత్ షా మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఎన్ఈఆర్ ప్రాంతం అభివృద్ధి జరగకుండా భారతదేశ అభివృద్ధి సంపూర్ణం కాదన్నది నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకే ఈ ప్రాంతంలో శాంతిస్థాపన కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీనికితోడుగా ఈశాన్యరాష్ట్రాల్లో వరదల కారణంగా ఏటా జరుగుతున్న నష్టాన్ని తగ్గించే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వరదలు, మాదక ద్రవ్యాల ప్రభావం లేని ఈశాన్య రాష్ట్రాల నిర్మాణం దిశగా అందరూ కలిసి పనిచేయాలన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు మిగిలిన భారతదేశంతో సమానంగా అభివృద్ధి చేందేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని, ఇందుకోసం ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ సంపూర్ణ సమన్వయంతో పనిచేసినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం వ్యాపారానుకూల వాతావరణ నిర్మాణం జరగాలని, తద్వారా ఉపాధి కల్పన, సాధికారత పెరిగేందుకు వీలవుతుందన్నారు. భారతీయ భాషలకు సరైన గౌరవం కల్పించే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్న అమిత్ షా.. నూతన జాతీయ విద్యావిధానం – 2020లో ప్రాంతీయ భాషల్లో కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా విద్యాభ్యాసం మాతృభాషలో జరగాలనే విషయాన్ని పొందుపరిచామన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు కమ్యూనికేషన్ కోసం ఒక భాష ఉండాలని ఉద్దేశంతోనే హిందీ భాషను నేర్చుకోవాలని చెబుతున్నామని ఆయన అన్నారు. సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న అమిత్ షా.. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయానికి చాలా అవకాశాలున్నాయన్నారు. ఎన్ఈసీ స్వర్ణోత్సవాలు జరుగుతున్న సందర్భంగా.. నవంబర్ 7న షిల్లాంగ్ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

అంతకుముందు కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 10 శాతం నిధుల సద్వినియోగం విషయంలో ఎన్‌ఈఆర్‌ రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పుడే ఈశాన్య రాష్ట్రాల పురోగతి సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధి కోసం కేంద్ర వ్యవసాయ, డోనర్ మంత్రిత్వ శాఖలు, ఈశాన్యరాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో ఏర్పాటుచేసిన ‘అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్’ నివేదిక ఈ నెలాఖర్లోగా సిద్ధమవుతుందని, తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని ముందడుగేయాలని కిషన్ రెడ్డి సూచించారు.

Tallest Tree: ఫలించిన మూడేళ్ల నిరీక్షణ.. అమెజాన్‌లో ఆ చెట్టును చేరుకున్న శాస్త్రవేత్తలు

ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాల్సిన పరిస్థితులను కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 500 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని 4,700 గ్రామాల్లో టెలికమ్యూనికేషన్ అనుసంధానత కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకునేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు ప్రత్యేకంగా కృషిచేయాలన్నారు. ఇందుకు అవసరమైన మౌలికవసతుల కల్పనకు సహకరించాలన్నారు. రెండ్రోజులుగా గువాహటిలో జరుగుతున్న ఎన్ఈసీ 70వ ప్లీనరీ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఇకపై చేపట్టాల్సి కార్యాచరణ, అడ్డంకులు, వాటి పరిష్కారాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.