Amberpet SI Arrest: అంబర్‌పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీకి సంబంధించిన సొత్తును కాజేసి తాకట్టు పెట్టిన వ్యవహారంలో భాను ప్రకాష్ రెడ్డి పాత్ర వెలుగులోకి రావడంతో అరెస్ట్ చేశారు. అంతేకాకుండా తన సర్వీస్ రివాల్వర్‌ను ఎక్కడో పోగొట్టుకున్నట్లు భాను ప్రకాష్ వెల్లడించారు. ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో రివాల్వర్ పోయిందని అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చిన ఆయన, ఎంత వెతికినా ఆయుధం దొరకలేదని కన్ఫెస్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సర్వీస్ రివాల్వర్ లాంటి కీలక ఆయుధం గల్లంతు కావడం భద్రతాపరంగా తీవ్ర అంశంగా మారడంతో విచారణ మరింత లోతుగా కొనసాగుతోంది. భాను ప్రకాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–2 ఉద్యోగం కూడా పొందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడికి రిలీవ్ చేయాలని ఇప్పటికే రిక్వెస్ట్ పెట్టుకున్నట్లు సమాచారం అందింది. అయితే ఈ కేసులో అరెస్టు కావడంతో ఆ ప్రక్రియపై కూడా అనిశ్చితి నెలకొంది. భాను ప్రకాష్ రెడ్డిపై నమోదైన ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని, అవసరమైతే మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.
READ MORE: Niharika-Rakasa : నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘రాకాస’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
