హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ఫ్లైఓవర్‌పై రేపటి నుంచి రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఫ్లైఓవర్ కింద స్మశాన వాటికలు రెండు వైపులా ఉండటంతో.. రోడ్డు విస్తరణ ఇబ్బందిగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. అంబర్‌పేట ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని కేంద్ర మంత్రి కోరారు. గోల్నాక నుండి అంబర్‌పేట ఇరానీ హోటల్ వరకు ఫ్లైఓవర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే.
అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘అంబర్‌పేట ఫ్లైఓవర్‌పై రేపటి నుంచి రాకపోకలకు అనుమతి వచ్చింది. ఫ్లైఓవర్ కింద స్మశాన వాటికలు రెండు వైపులా ఉండటంతో రోడ్డు విస్తరణ ఇబ్బందిగా మారింది. భ సేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఫ్లైఓవర్ కింద 6 చోట్ల ఇబ్బందిగా ఉంది. 2 కోట్ల 51 లక్షలు చెక్కులు తీసుకొని భూమి ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని కోరుతున్నా. అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించాం. అంబర్‌పేట ప్రజలు సహకరించాలి. 337 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశాం’ అని తెలిపారు.