అమెజాన్ సంస్థ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దాదాపు 5,000 ఉద్యోగాలను తొలగించడంతో పాటు 15 వేర్‌హౌస్‌లను మూసివేయాలని యోచిస్తోంది. న్యూయార్క్ సిటీలో ప్రతిపాదిత ‘డెలివరీ ప్రొటెక్షన్ యాక్ట్’ చట్టరూపం దాలిస్తే ఈ కోతలు జరిగే అవకాశం ఉంది. మేయర్ జోహ్రాన్ మామ్దాని మద్దతు ఇస్తున్న ఈ బిల్లు ప్రకారం.. ప్రస్తుతం 40 థర్డ్-పార్టీ కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న 5,000 మందికి పైగా డెలివరీ వర్కర్లను అమెజాన్ నేరుగా తన ఉద్యోగులుగా నియమించుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ సాధారణంగా డెలివరీ డ్రైవర్లను నేరుగా నియమించుకోకుండా, థర్డ్-పార్టీ కాంట్రాక్టర్లపై ఆధారపడుతుంది. ఈ బిల్లు కనుక పాస్ అయితే, కంపెనీ తన డెలివరీ మోడల్‌ను మార్చుకోవాల్సి వస్తుంది.
ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, పని పరిస్థితులు కల్పించేందుకే ఈ బిల్లు తెస్తున్నట్లు మద్దతుదారులు చెబుతున్నప్పటికీ, దీనివల్ల భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. కెనడాలోని క్యూబెక్‌లో యూనియనీకరణ కారణంగా అమెజాన్ తన వేర్‌హౌస్‌లను మూసివేసిన ఉదాహరణను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ బిల్లు వల్ల కాంట్రాక్టర్లు తమ వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, వేలాది మంది ఉపాధి గాలిలో కలిసిపోతుందని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
వేర్‌హౌస్‌ల మూసివేత వల్ల డెలివరీ వేగం తగ్గిపోయి, వినియోగదారులపై అదనపు భారం పడుతుందని అమెజాన్ వాదిస్తోంది. ఈ చట్టం అమలైతే డెలివరీ ఖర్చులు విపరీతంగా పెరిగి, ఒక ప్యాకేజీపై అదనంగా డెలివరీ ఛార్జీలు పడే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తన వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తున్న అమెజాన్, రిటైల్ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తోంది. పాండమిక్ సమయంలో అధిక నియామకాలు జరగడం వల్లే ఈ కోతలు తప్పవని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , డేటా సెంటర్ల మీద భారీగా పెట్టుబడులు పెడుతున్న తరుణంలో, ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

